దామరచర్ల మండలం వాడపల్లి, ఇర్కిగూడెం గ్రామ పంచాయితీల సమీపంలో కృష్ణా గోదావరి పవర్ యుటిలిటీస్ లిమిటెడ్ సంస్థ రూ.720 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పరిశ్రమలపై జనవరి 5న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఇర్కిగూడెం, వాడపల్లి పంచాయతీ కార్యాలయానికి సోమవారం సమాచారం అందింది. సోడియం శాచరిన్, ఉప ఉత్పత్తుల పరిశ్రమ, 65 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కల్గిన బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు సదరు సంస్థ పీసీబీకి దరఖాస్తు చేసుకుంది. అక్టోబర్ 10న ఇర్కిగూడెం, వాడపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సి ఉండగా మునుగోడు ఉప ఎన్నిక ఉండటంతో అధికారులు వాయిదా చేశారు. తాజాగా పీసీబీ పబ్లిక్ హియరింగ్ తేదీని ప్రకటించింది. ఇదిలా ఉండగా సోడియం క్రోమైట్స్ రసాయనాల తయారీ పరిశ్రమ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ పాలకవర్గంతో పాటు అఖిలపక్షాల నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. పర్యావరణ వేత్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్లాంటు ప్రభావిత గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
