ఫార్మాసిటీని రద్దు చేయాల్సిందే

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫార్మాహబ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వాసిత రైతులు చేపట్టిన పాదయాత్ర బుధవారం తుర్కయంజాల్‌లోని ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ నాయకులు సంఘీభావం తెలపడంతో పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఫార్మాసిటీ భూములకు రైతు బంధు, బీమా వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎలాంటి షరతులు లేకుండా ఆన్‌లైన్‌ పహాణీలలో రైతుల పేర్లను నమోదు చేయాలని, పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రైతులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో వెంకటాచారికి అందజేశారు. డబ్బులు తీసుకోని 400 మంది పేర్లు ధరణిలో వచ్చేటట్లు చేస్తామని ఆర్డీవో ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాగా, ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు 2022 మార్కెట్‌ ధర ప్రకారమే పరిహారం చెల్లించాలని, లేదా ప్రత్యామ్నాయంగా భూమి చూపాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. విలువైన భూములను లాక్కొని రైతుల కళ్లల్లో కారం కొట్టి బజారున పడేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాదయాత్రలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ బాధిత రైతులకు న్యాయం అందే వరకూ అండగా ఉంటామని చెప్పారు.