తెలంగాణ ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా వేణుగోపాలాచారి

తెలంగాణ ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా స‌ముద్రాల వేణుగోపాలాచారి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప‌ద‌విలో వేణుగోపాలాచారి రెండేండ్ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నారు.

నిర్మ‌ల్ జిల్లాకు చెందిన స‌ముద్రాల వేణుగోపాలాచారి.. 1985 నుంచి వరుసగా 1996 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో మంత్రిగా ఉంటూనే ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన వేణుగోపాలాచారి దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌ మంత్రివర్గంలో సంప్రదాయేతర ఇంధనవనరుల శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో మరోసారి గెలిచి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 1999లో మూడోసారి ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిచి 2004 వరకు కొనసాగారు. 2004 ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఎంపీగా ఓడిపోయిన ఆయన 2009లో కొత్తగా ఏర్పాటైన ముథోల్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో టీడీపీకి రాజీనామా చేసి తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ముథోల్‌ నుంచి మరోసారి విజయం సాధించారు. 2013లో టీఆర్ఎస్‌లో చేరిన త‌ర్వాత 2014 ఎన్నిల్లో ఓటమి పాల‌య్యారు. ఆ స‌మ‌యంలో ఢిల్లీలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా కేసీఆర్ నియ‌మించారు.