అభివృద్ధి పనుల పేరుతో నల్గొండ పట్టణంలో రోడ్లను అడ్డంగా తవ్వి వదిలేయడంతో ప్రధాన రోడ్లతో పాటు, గల్లీలు సైతం అధ్వానంగా మారాయి. ఏడాది కిందటే పూర్తి చేయాల్సి ఉన్నా రోడ్ల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్లు తవ్విన చోట హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుండగా, రోడ్డు నుంచి లేస్తున్న దుమ్ముతో స్థానికులు, వ్యాపారులు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఆలస్యం అవుతున్న అభివృద్ధి పనులు
నల్గొండలోని క్లాక్‌టవర్ సెంటర్ నుంచి నలువైపులా రోడ్ల పనులు చేపట్టారు. హైదరాబాద్, దేవరకొండ వైపు వెళ్లే రోడ్లను వెడల్పు చేస్తుండగా, క్లాక్‌టవర్ నుంచి పానగల్ బైపాస్ వరకు రూ. 100 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తున్నారు. పైప్‌లైన్ వేసే పనులు పూర్తయ్యాయి. దానిమీద రోడ్డు వేసే పనులను నేషనల్ హైవే అథారిటీ చేపట్టాల్సి ఉంది. కానీ ఆ పనులు స్టార్ట్ కావడానికి ఇంకా టైం పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.ఇక ఎప్పుడో పూర్తి కావాల్సిన హైదరాబాద్ రోడ్డు నిర్మాణ పనులు కోర్టు కేసుల వల్ల లేట్ అవుతున్నాయి. దీంతో డివైడర్ల మధ్యలో మొక్కలు నాటడం కోసం తీసుకొచ్చిన మట్టిని రోడ్లపైనే పోసి వదిలేశారు. క్లాక్‌టవర్ నుంచి హైదరాబాద్ రోడ్డు విస్తరణ కోసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టిన సర్కార్, ఇప్పటివరకు చేసిన పనులకు పేమెంట్ చేయలేదు. బిల్లులు రావడం లేదన్న ఉద్దేశంతో ఆఫీసర్లు సైతం కాంట్రాక్టర్లను ఏమీ అనలేకపోతున్నారు.
పెద్ద ఎత్తున లేస్తున్న దుమ్ము
తవ్విన రోడ్లపై దుమ్ము లేవకుండా వాటర్ క్యూరింగ్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటిదే. కానీ వారు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వాహనాలు వెళ్తున్న టైంలో పెద్ద ఎత్తున దుమ్ము లేస్తుండడంతో బైక్‌లు, ఆటోల్లో వెళ్లేవారు, పండ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ఆఫీసర్లను కోరినా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. దుమ్ము కారణంగా ట్రాఫిక్ పోలీసులు సైతం డ్యూటీ చేయలేకపోతున్నారు. దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.