ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన జమున: సీఎం కేసీఆర్‌

అలనాటి నటి జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. వందల చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని చెప్పారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందారన్నారు. సినీనటిగా కళాసేవకే పరిమితం కాకుండా ఎంపీగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన జమున ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

సీనియర్‌ నటి జమున కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని ఫిల్మ్‌ చాంబర్‌కు తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. అనంతరం మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు నిర్వహించనున్నారు.