గ్రేగోల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమలో ప్రమాదం

  • ఇద్దరి మృతి, ఒకరికి గాయాలు
  • మూడు నెలల్లో రెండో ప్రమాదం

మఠంపల్లి మండల కేంద్రంలోని గ్రేగోల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమలో సోమవారం పెను ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కార్మికులు మునగపాటి సైదులు(46), పట్టేటి సాయి(23), మల్లెబోయిన సైదులు కిలన్‌ దగ్గర పని చేస్తుండగా ఒక్కసారిగా బ్యాక్‌ఫైర్‌ కావడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని తోటి కార్మికులు వెంటనే చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మునగపాటి సైదులు చనిపోయాడు. పట్టేటి సాయి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మల్లెబోయిన సైదులు కోదాడలో చికిత్స పొందుతున్నాడు.

మూడు నెలల క్రితం కిలన్‌ వద్ద ఇదే రీతిన ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. మూడు నెలల్లో రెండు ప్రమాదాలు జరగడంపై గ్రామస్తులు, కార్మిక సంఘాల నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో సీఐటీయూ సిమెంట్‌ క్లస్టర్‌ యూనియన్‌ కార్యదర్శి వట్టెపు సైదులు, మండల కన్వీనర్‌ సయ్యద్‌ రన్‌మియా, సీపీఎం మండల కార్యదర్శి మాలోతు బాలూనాయక్‌, రాము, గోవింద్‌, ఆదినారాయణ, బీఆర్‌ఎస్‌కేవీ నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్‌ పాల్గొన్నారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్‌ఐ ఇరుగు రవి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను మఠంపల్లి జడ్పీటీసీ జగన్‌నాయక్‌, మాజీ ఎంపీపీ కొండానాయక్‌ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలను రూ.50లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.