బొక్కల కంపెనీని సందర్శించిన తహసీల్దార్‌

యాచారం మండలంలోని కొత్తపల్లి – తక్కళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీని సోమవారం తహసీల్దార్‌ సుచరిత, ఆర్‌ఐ వెన్నెలతో కలిసి సందర్శించారు. ఆమె కంపెనీలోకి వెళ్లగానే అక్కడి దుర్వాసనతో తహసీల్దార్‌ ఇబ్బందిపడ్డారు. ఈ కంపెనీలో ఎంత మంది పని చేస్తున్నారు, నూనె ఇతర పదార్థాలను ఎక్కడి నుంచి తెస్తారు, ఏమేమీ తయారు చేస్తారు, ఎక్కడకు రవాణా చేస్తారు.. తదితర వివరాలను ఆమె నమోదు చేసుకున్నారు. కంపెనీ తీరుపై కొత్తపల్లి, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ, కిషన్‌పల్లి గ్రామాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాల్సి ఉందని, ఈ మేరకు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలకు సమాచారం అందించాలని ఆందోళనకారులకు సూచించారు. బొక్కల కంపెనీ మూసివేయాలని ఇటీవల అసెంబ్లీలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తేవడంతో కంపెనీనీ తహసీల్దారు సుచరిత సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు బొక్కల కంపెనీ మూసేదాక తమ ఆందోళన కొనసాగుతుందని ఆయా గ్రామాల ప్రజలు తేల్చిచెప్పారు. కంపెనీనీ తహసీల్దారు సందర్శించిన సమయంలో రైతులు ఆందోళన కొనసాగించారు. స్థానికులకు న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు.