మేడారం జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. వనం జనంతో నిండిపోతున్నది. మేడారం మహాజాతరకు భక్తుల రద్దీ పెరుగుతున్నది. శుక్రవారం సుమారు 5 లక్షల మంది మేడారంలో మొక్కులు చెల్లించారు. గత జాతరతో పోలిస్తే ఈ జాతర సమయంలో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు కుటుంబాల సమేతంగా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది. జంపన్నవాగులో జలకళతో దర్శనమిచ్చింది. భక్తులు అందులో స్నానాలు చేశారు. కల్యాణకట్టలో తలనీలాలు ఇచ్చారు. కాలినడకన తల్లుల గద్దెల ప్రాంతానికి చేరుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్‌ ద్వారా భక్తులను అనుమతించారు. భక్తులు అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తు బెల్లం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో పలువురు తప్పిపోగా మీడియా సెంటర్‌ వద్ద ఉన్న అనౌన్స్‌ మెంట్‌ను ఆశ్రయించి మైక్‌ ద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పార్కింగ్‌లోకి వాహనాలను మళ్లించారు.