ఎఫ్‌డీసీకి అంతర్జాతీయ గుర్తింపు

  • ఫారెస్ట్‌ స్టీవార్డ్‌ కౌన్సిల్‌ సర్టిఫికెట్‌ జారీ
  • అట‌వీ అధికారులు, సిబ్బందిని అభినందించిన‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఆకుపచ్చని తెలంగాణకు విశేష కృషి చేస్తున్న అటవీ శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. అడవుల నిర్వహణ, అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎఫ్‌డీసీ)కు ఫారెస్ట్‌ స్టీవార్డ్‌ కౌన్సిల్‌ సర్టిఫికెట్‌ (జర్మనీ) దక్కింది. సేంద్రియ పద్ధతిలో యూకలిప్టస్‌, వెదురు, టేకు, జీడిమామిడి వంటి అటవీ ఉత్పత్తుల (ముడిసరుకు) నుంచి తయారయ్యే వస్తువులకు ఐదేండ్లపాటు తన లోగోను ఉపయోగించుకొనేందుకు టీఎస్‌ఎఫ్‌డీసీకి ఫారెస్ట్‌ స్టీవార్డ్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌సీఎస్‌) అనుమతి ఇచ్చింది. గురువారం హైదరాబాద్‌ అరణ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యూకలిప్టస్‌, వెదురు, టేకు, జీడిమామిడి చెట్లను అత్యున్నత ప్రమాణాలతో సాగు చేస్తున్నామని పేర్కొన్నారు.

కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లలో దాదాపు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఇమేజ్‌ పెరుగుతున్నదని, ఐకియా వంటి ఇంటర్నేషనల్‌ బ్రాండ్లకు ఎఫ్‌ఎస్‌సీ ధ్రువీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కిందని చెప్పారు. ఐదేండ్లలో రూ.10 కోట్ల అదనపు ప్రయోజనం కలుగుతుందని, కాంపోజిట్‌ ఉడ్‌ పేపర్‌, ప్యాకింగ్‌ పరిశ్రమల కోసం ప్రాసెస్‌ చేసిన ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో పచ్చదనం పెంపునకు అనేక చర్యలు తీసుకొంటున్నామని, దీనివల్ల తెలంగాణ అటవీ శాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు వస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ డొబ్రియాల్‌, అటవీశాఖ అదనపు కార్యదర్శి ప్రశాంతి, ఎఫ్‌డీసీ వీసీ, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.