లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కీసర ట్రాన్స్‌కో ఏఈ అనిల్‌

మరో ఉద్యోగి అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు(ACB Raids) రెడ్‌ హ్యండెడ్‌గా చిక్కాడు. మేడ్చల్‌ జిల్లా కీసరకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ (Transco AE) అనిల్‌ మంగళవారం ఓ గుత్తేదారుడి నుంచి రూ 12 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. విద్యుత్‌ శాఖలో ఓ నిర్మాణానికి సంబంధించిన బిల్లు కొంతకాలంగా పెండింగ్‌లో ఉంది. ఆ బిల్లు మంజూరు చేయాలని గుత్తేదారు పలుమార్లు ట్రాన్స్‌కో ఏఈ అనిల్‌ను కోరాడు. తనకు లంచం ఇస్తేనే బిల్లు ఇస్తానని వేధింపులకు గురిచేశాడు.

చివరకు బాధితుడు గుత్తేదారు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఏఈ కార్యాలయానికి చేరుకున్నారు. బాధితుడి నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించి ఆయన వద్ద రసాయనాలు పూసి ఉన్న రూ.12 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఈ అనిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

కాగా గత శనివారం ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. మనబస్తీ-మన బడిలో చేపట్టిన అభివృద్ధి పనులకు గాను గుత్తేదారు వద్ద హెచ్‌ఎం లంచం డిమాండ్ చేసింది. దీంతో సదరు గుత్తేదారు హెచ్‌ఎంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు హెచ్‌ఎం శ్రీదేవికి రూ. 25 వేలు ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.