అటవీ శాఖలో వసూళ్ల పర్వం

  • బొగ్గు బట్టీల పర్మిట్ల పేరిట దందా
  • వ్యాపారుల నుంచి లక్షల్లో ముడుపులు
  • అక్రమంగా కలప తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అధికారులు
  • ఓ ఉన్నతాధికారిపై పెద్దఎత్తున ఆరోపణలు
  • నార్కట్‌పల్లిలో మొదలైన విజిలెన్స్‌ విచారణ

అటవీశాఖలో ఓ ఉన్నతాధికారి నుంచి మొదలుకుని కిందిస్థాయి అధికారుల వరకు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వసూళ్ల పర్వం లక్షల్లోకి చేరుకుంది. ప్రతి దానికీ ఓ రేటును కట్టి సంబంధిత శాఖ సిబ్బంది నుంచి మొదలు అధికారులు బాహాటంగా వసూలు చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమంగా కలపను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బొగ్గుబట్టీల పర్మిట్ల పేరిట దందా సాగుతోంది. ఒక నెలలో రూ.13.50 లక్షల వరకు అటవీశాఖ అధికారులకు మామూళ్లుగా అందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు తీరును చూసి కిందిస్థాయి ఉద్యోగులు సైతం ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ఒక బొగ్గు బట్టీకి పర్మిట్‌ ఇవ్వాలంటే జిల్లాలో ప్రత్యేకంగా రూ.4,500లను రేటుగా నిర్ణయించారు. ఈ మొత్తం ఇస్తేనే పర్మిట్‌ ఇస్తారు. ఇందులో నుంచి ఓ అధికారికి రూ.1,150, మరొకరికి రూ.1000, ఇంకొకరికి రూ.800 ఆ తర్వాత వరుసగా ఒక్కో కేడర్‌ను బట్టి రూ.500, రూ.350, రూ.200, రూ.300 ఇలా అంతా కలిపి పంచుకుంటున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు పంపకాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లంచాలు ఇవ్వని వారికి వేధింపులు తప్పడం లేదు. జిల్లాలో నెలకు 300 పర్మిట్ల ద్వారా బొగ్గు రవాణా అవుతోంది. అంటే ఒక్కో పర్మిట్‌కు రూ.4,500 చొప్పున మొత్తం 300 పర్మిట్లకు రూ.13.50 లక్షల వరకు అటవీశాఖ అధికారులకు అందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నుంచి ఒక్కపైసా కూడా ప్రభుత్వ ఖజానాకు వెళ్లే పరిస్థితి లేదు. బొగ్గు బట్టీలో లంచాల రూపంలో ఓ అధికారికి ఏకంగా ప్రతి నెలా రూ.4 లక్షల 50 వేలు వెళ్తున్నాయంటే సదరు ఫారెస్టు అధికారి సంపాదన ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. నల్లగొండ, మునుగోడు, మిర్యాలగూడ రేంజ్‌ కార్యాలయ పరిధిలో బొగ్గు బట్టీల పర్మిట్లు పెద్దఎత్తున జారీ అవుతున్నాయి.

సామిల్‌ మిల్లుల వద్ద వసూళ్లే వసూళ్లు
జిల్లాలోని ఓ డివిజన్‌ ఫారెస్టు కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న ఓ ఉద్యోగి ఓ సామిల్‌ మిల్లు వద్ద ఇటీవల రూ.లక్ష లంచంగా తీసుకున్న విషయం ఉన్నతాధికారులకు తెలిసినా ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇతను గతంలో జిల్లాలోని ఓ కార్యాలయం నుంచి ఇటీవల బదిలీపై ఆ డివిజన్‌కు వచ్చాడు. అయితే ఉన్నతాధికారికి అనుకూలంగా ఉంటుండడంతో అతను లంచం తీసుకున్నా ఏచర్యలు తీసుకోకుండా అందులో నుంచి తన వాటా తీసుకోవడం గమనార్హం. ఉన్నతాధికారులు లంచాలకు అలవాటు పడడంతో కిందిస్థాయి ఉద్యోగులు సైతం ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నా విజిలెన్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకపోతే అటవీ అభివృద్ధిలో భా గంగా అటవీ ప్రాంతంలో చేపట్టే పనులకు 5 శాతం లం చం చెల్లించాల్సిందే, లేకుంటే బిల్లులు మంజూరు చేసే పరిస్థితి ఉండదు. ప్రతిరోజూ జిల్లా నుంచి హైదరాబాద్‌ కు 350 లారీల కలప రవాణా అవుతుంటుంది. ఒక్కో కలప లారీకి నెలకు రూ.3వేలు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి నెలా రూ.10.50లక్షలు కలప రవాణా చేసే లారీల యజమానుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులోనుంచి సైతం ఓ ఫా రెస్టు అధికారికి నెలకు రూ.లక్ష వరకు చేరుతున్నట్లు గు సగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ అధికారి అవినీతి సొమ్మును తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి మళ్లీ ఓ రేంజ్‌ అధికారిగా పోస్టింగ్‌ తెచ్చుకున్నట్లు సమాచారం.

ప్రతిదానికి ఓ రేటు పెట్టి..
ఇప్పటికే డిప్యుటేషన్ల పేరిట వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు ఇక పట్టా భూముల్లో టేకు చెట్లు నరికి ఆ కలపను రవాణా చేసుకోవడానికి ఒక్కో పర్మిట్‌కు రూ.20వేల నుంచి రూ.25వేల వర కు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా నెలకు 100 పర్మిట్ల చొప్పున ఇస్తూ రూ.25లక్షల మేరకు లంచాల రూపంలో వసూ లు చేయడం గమనార్హం. ఇందులో కేడర్‌ను బట్టి అధికారులు వారికి పంపకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈవిధంగా పట్టా భూముల్లో పర్మిట్ల ను ఇచ్చి ఓ అధికారికి నెలకు రూ.2లక్షలు తన జేబులో నింపుకుంటున్నట్లు సంబంధిత శాఖలో చర్చ సాగుతోంది. నార్కట్‌పల్లి- అద్దంకి రహదారి వెంట ఓ పెట్రోల్‌బంకుకు సంబంధించిన యజమాని బొగ్గు పర్మిట్‌ కోసం అధికారుల కు లంచాలు ఇస్తూ బినామీ పేర్లతో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జాతీయ రహదారిపై చౌటుప్పల్‌, చిట్యాల మధ్యన ఓ అధికారి ఏకంగా 12 ఎకరాల భూమి రూ.24 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి బొగ్గు పర్మిట్ల నుంచి వసూలు చేసిన అవినీతి సొమ్మేనని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులు అండ గా నిలుస్తుండడంతో టేకు కలప వ్యాపారంతో పాటు బినామీ సామిల్‌ వ్యాపారం నిర్వహిస్తున్న ట్లు సమాచారం. ఇటీవల ఓ అధికారి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా లంచాలు తీసుకుని సస్పెండ్‌ అ యి తిరిగి జిల్లాకు పోస్టింగ్‌ వేయించుకున్నట్లు తెలుస్తోంది. ఓ ఫారెస్టు అధికారి ఏకంగా బొగ్గు పర్మిట్లను తీసుకుని మిర్యాలగూడకు బయల్దేరి దేవరకొండ రూట్లలో బొగ్గు పర్మిట్లను విక్రయిస్తూ నకిరేకల్‌ నియోజకవర్గం వరకు నిత్యం పర్యటిస్తున్నట్లు కూడా చర్చ సాగుతోంది. ఇటీవల నల్లగొండ నియోజకవర్గంలోని ఓ సామిల్‌లో అక్రమంగా నిల్వ ఉన్న టేకు కలపను గుర్తించిన అధికారులు కేసు నమోదు చేయకుండా లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిరేకల్‌ నియోజకవర్గంలో ఓ వ్యక్తిని తమ ఏజెంట్‌గా నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పెద్దఎత్తున అవినీతి, ఆరోపణలు రా వడంతో అటవీశాఖ అధికారుల వ్యవహార శైలిపై నార్కట్‌పల్లి మండలంలో మంగళవారం విజిలెన్స్‌ విచారణ నిర్వహించారు. ఈవిచారణలో అటవీశాఖ అధికారుల అక్రమాలు పెద్దఎత్తున వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. (సోర్స్: ABNఆంధ్రజ్యోతి)