జీడిమెట్లలోని అరోరా ఫార్మాస్యూటికల్స్‌లో ఘోరం.. ఇద్దరు యువకుల మృతి

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ల్యాబ్ లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రదేశంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ల్యాబ్ లో పనిచేస్తున్న రవీందర్ రెడ్డి (25), కుమార్ (24) ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి మృతిచెందారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కంపెనీ యాజమాన్యం మీడియాను లోపలికి అనుమతించడం లేదని సమాచారం. ఉదయం జరిగిన ఈ సంఘటనను కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. మృతులు రవీంద్రరెడ్డి, కుమార్ లుగా గుర్తించారు. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు తగిన న్యాయం చేయాలని వారు వాపోతున్నారు.

కాగా హైదరాబాద్ లో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దక్కన్ మాల్ లో జరిగిన అగ్నిప్రమాదం జరిగిన దగ్గరి నుంచి ఈ ప్రమాదాల పరంపర ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ అగ్నిప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా నగరంలోని జీడిమెట్లలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.