లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

అవినీతి అధికారులపై ఏసీబీ అధికారుల దాడుల ( ACB Raids) పరంపర కొనసాగుతుంది. వారం వ్యవధిలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. తాజాగా జనగామ జిల్లా (janagaon district) స్టేషన్‌ ఘనపూర్‌ మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మండలంలోని శివునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న చిరంజీవి సివిల్‌ కాంట్రాక్టర్‌ (civilcontractor) వద్ద నుంచి రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.

పంచాయతీ పరిధిలో చేసిన పనులకు సివిల్‌ కాంట్రాక్టర్‌ కొమురయ్య రావాల్సిన బిల్లులు కార్యదర్శికి అడిగాడు. తనకు లంచం ఇవ్వనిదే బిల్లులు ఇవ్వనని ఇబ్బందులపాలు చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శికి డబ్బులు ఇస్తుండగా అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల మేడ్చల్‌లో ట్రాన్స్‌కో ఏఈ, ఖమ్మం జిల్లా మధిరలో హెచ్‌ఎం లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.