ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే.. దేశ‌ప‌తి శ్రీనివాస్‌కు అవ‌కాశం

బీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా దేశ‌ప‌తి శ్రీనివాస్, కుర్మ‌య్య‌గారి న‌వీన్ కుమార్, చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి పేర్ల‌ను సీఎం ఖ‌రారు చేశారు. ఈ నెల 9వ తేదీన నామినేష‌న్లు దాఖలు చేయాల‌ని ఆ ముగ్గురు అభ్య‌ర్థుల‌కు కేసీఆర్ సూచించారు.

నామినేష‌న్ల దాఖ‌లుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల‌ని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా… రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇచ్చారు. 14న నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 23న ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్‌ అనంతరం అదే రోజు కౌంటింగ్‌ ఉంటుంది.

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో రాజకీయ అవసరాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ద్వారా పార్టీకి కలిగే ప్రయోజనాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా, మే చివరిలో ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌ల పదవీకాలం కూడా పూర్తి కానుంది. ఈ రెండు స్థానాల భర్తీకి సంబంధించి గడువు ముగిసేలోపు ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు.