రైతుల కోసం 16 సూత్రాల కార్యాచ‌ర‌ణ‌ పథకం – ఆర్థిక మంత్రి నిర్మ‌ల

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం 16 సూత్రాల కార్యాచ‌ర‌ణ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ది. బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఆర్థిక మంత్రి నిర్మ‌ల ఈ విష‌యాన్ని తెలిపారు. వ్య‌వ‌సాయ క్రెడిట్ టార్గెట్‌ను 15 ల‌క్షల కోట్లుగా పెట్టుకున్నారు. నాబార్డ్ స్కీమ్ ద్వారా ఆ క్రెడిట్ జారీ చేయ‌నున్నారు. విలేజ్ స్టోరేజ్ స్కీమ్‌ను ఎస్‌హెచ్‌జీలు న‌డ‌పనున్నాయి. వాటితో రైతు ఉత్ప‌త్తుల సామ‌ర్థ్యాన్ని పెంచ‌నున్నారు. గ్రామ‌ల్లో మ‌హిళ‌లు.. ధ్యాన‌ల‌క్ష్మిలుగా మార‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. వేర్‌హౌజ్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. స‌మ‌ప‌ద్ధ‌తిలో ఎరువుల వినియోగాన్ని పెంచ‌నున్నామ‌న్నారు. పీపీపీ ప‌ద్ధ‌తిలో కిసాన్ రైల్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఆ రైలుతో రైతు ఉత్ప‌త్తుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. ఒక జిల్లాలో ఒక పంట అన్న ల‌క్ష్యంతో ప‌నిచేయ‌నున్నామ‌ని, దాంతో జిల్లా స్థాయిలో ఫోక‌స్ పెర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ-నేష‌న‌ల్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ మార్కెట్ ద్వారా వేర్‌హౌజింగ్ నిర్వ‌హించ‌నున్నారు. పాల శీత‌లీక‌ర‌ణ‌ను 2025 క‌ల్లా రెట్టింపు చేయ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు.మ‌త్స్యు ఉత్ప‌త్తిని 2022-23 క‌ల్లా 200 ల‌క్ష‌ల ట‌న్నులు చేయాల‌ని ల‌క్ష్యం పెట్టుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. సాగ‌ర మిత్ర పేరుతో సుమారు 500 మ‌త్స్య సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వ్య‌వ‌సాయ అనుబంధ కార్య‌క‌లాపాల కోసం 2.83 ల‌క్ష‌ల కోట్లు కేటాయించారు.