- పెద్దల నిర్వాకంతో అమాయకపు పేదలు బలి..!
- క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే ఎన్ఓసీలు ఇస్తున్న పలు శాఖల అధికారులు
- బ్లాస్టింగ్ లతో ఇండ్లు, పొలాలు, మూగ జీవులు నాశనమవుతున్న పట్టించుకోని అధికారులు
- పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న క్వారీలు, క్రషర్ల యాజమాన్యాలు
- క్రషర్లకు అడ్డగోలు అనుమతులు ఇస్తున్న ఇసి కమిటీ
- అవినీతిలో మునిగితేలుతున్న ఇసి కమిటీ
పెద్ద ఎత్తున పైరవీలతో క్వారీలు, క్రషర్లకు అనుమతులు వస్తుండటంతో పెద్దల నిర్వాకానికి అమాయకపు పేదలు బలౌతున్నారు. తమకు క్వారీలు, క్రషర్లు వద్దు మొర్రో అంటూ ప్రజలు, పర్యావరణ వేత్తలు, మేధావులు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువైండు. బడా రాజకీయ నాయకులను, అధికారులను గుప్పిట్లో పెట్టుకున్న క్వారీలు, క్రషర్ల యాజమాన్యాలు అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు. ఇండ్లు, పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేదక్, మేడ్చల్, యదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్ నగర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల ఎకరాలకు ఎకరాలను సదరు వ్యాపారులు 20 లేదా 30 ఏళ్ల పాటు లీజ్ కు తీసుకొని అక్రమంగా క్వారీలు, క్రషర్లు నిర్వహిస్తున్నారు. అధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల తమకు చెడ్డ పేరు వస్తుందని కొంతమంది రాజకీయ నాయకులు కంటితుడుపుగా మాట్లాడుతున్నారు కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో క్వారీల చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు.. సమీపంలో సాగు చేసుకుంటున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు మాత్రం మూడు పూలు.. ఆరు కాయలుగా విరజిల్లాలి. కానీ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రజల జీవితాలు నాశనం అయిన తమకు ఏమీ పట్టదనే ధోరణిలోనే అధికారులు, నాయకులు వ్యవహరిస్తున్నారు. పేదలకు నష్టం కలిగించే వ్యవహారాలు పెద్దలు చేసినప్పుడు సహాజంగానే ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తాయి. ఆ పోరాటలతో బాధితులకు ఎంతో కొంత లబ్ధి చేకురుతుంది. ఈ పోరాటాలను విడిచి సొంత ప్రయోజనాలకే అధికార, ప్రతిపక్షాలు పని చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఏర్పాటు చేసిన క్వారీలు, క్రషర్ లతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే క్వారీలు, క్రషర్ లు ఏర్పాటు చేసిన పరిసరాల్లో పంట పొలాలు, తోటలు, కోళ్ల ఫామ్ లు, అనేక రకాలైన జీవరాశులు ఉన్నాయి. సాగులోనున్న పంటలను లెక్కలోకి తీసుకోకుండా పలు శాఖల అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఎన్ఒసిలు జారీ చేస్తున్నారు. ఈ ఎన్ఒసిలను ఆధారంగా చేసుకొని పిసిబి అధికారులు సైతం అదే పద్దతితో సిఎఫ్ఇ, సిఎఫ్ఒ లు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తదనంతరం ఫైరవీలతో, కాసులతో అనుమతులు తెచ్చుకున్న క్వారీ, క్రషర్ వ్యాపారులు ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న రైతులు, పరిసర ప్రాంతాల ప్రజలు నెత్తి, నోరు మొత్తుకున్న ఫలితం లేకుండాపోతుంది.
పేరుకు ప్రజాభిప్రాయ సేకరణ అంటూ నిర్వహిస్తూ ప్రజలు, పర్యావరణ వేత్తలు, మేధావుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా అధికారులు, రాజకీయ పార్టీల నేతలు అక్రమ సొమ్ముకు ఆశపడి అక్రమ మార్గంలో క్వారీలు, క్రషర్ ల యాజమాన్యాలకు అన్ని విధాలుగా సహకారం అందించడమే కాక వారికి అనుమతులు వచ్చేలా దగ్గరుండి అన్ని పనులు చేసిపెడుతున్నారు.. ఈ విషయం అందరికీ తెలిసిందే.
క్రషర్లకు అడ్డగోలు అనుమతులు ఇస్తున్న ఇసి కమిటీ
ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మైనింగ్, స్టోన్ క్రషర్లు ఇష్టారీతిన పేలుళ్లకు పాల్పడుతున్నాయి. వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళితో చుట్టుపక్కల ప్రజలు రోగాల బారినపడుతున్నారు. వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా ఈ మధ్య కాలంలో కొన్ని మైనింగ్, స్టోన్ క్రషర్లకు తు..తు.. మంత్రంగా ప్రజాభిప్రాయలు జరిపి స్థానికంగా 100% వ్యతిరేకత ఉన్న నాలుగు గోడల మధ్య కూర్చొని అడ్డగోలుగా లంచాలు తీసుకొని ఇసిలను ఇస్తున్నారు అని కాలుష్య బాధితులు తమ బాధను చెప్పుకోవడమే కాకుండా ఇసిలను అడ్డగోలుగా జారీచేస్తున్న కమిటీపై విజిలెన్స్ & ఎంఫోర్స్ మెంట్ అధికారులు, ఏసీబీ అధికారులు దాడులు చేస్తే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో… వీరి అక్రమ సంపాదన ఎంతో.. లేదా వీరి నిజాయితీ ఎంతో కూడా బట్టబయలు అవుతుందని అంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో 100% వ్యతిరేకిస్తే అనుమతులు రావు అనుకొని మోసపోతున్నాం అని కాలుష్య బాధితులు చెబుతూ.. ప్రజాభిప్రాయ సేకరణలో 100% మేము వ్యతిరేకించిన మైనింగ్, స్టోన్ క్రషర్ల యాజమాన్యాలు దొడ్డిదారిన ఇసి కమిటీకి లంచాలు ఇచ్చి మాకు ఇష్టం లేకున్నా దొంగ అనుమతులు పొందడం ద్వారా పిసిబి అధికారులు, ఇసి కమిటీ వారు, మైనింగ్, స్టోన్ క్రషర్ల యజమానులు కాలుష్యంతో మా బతుకులను ఆగం చేస్తూ.. వారు మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తూ.. జల్సాలు చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే తమ జీవితాలు ఆగం అవుతాయి వీరిపై వెంటనే విచారణ జరిపి తమను కాలుష్యం బారి నుండి కాపాడాలని కోరుతున్నారు. ఇది ప్రస్తుత మన దౌర్భాగ్య స్థితికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే ఇప్పటికే నాశనమైన పర్యావరణం మరింతగా నాశనం అవుతుందని పలువురు మేధావులు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. క్వారీలు, క్రషర్లకు అడ్డగోలు అనుమతులు ఎలా వస్తున్నాయి..? వాటి వెనుక ఉన్న ఇసి కమిటీ బాగోతాలు.. వారికి సహకరిస్తున్న కన్సల్ టెంట్ల తీరుపై రాబోయే కథనంలో.. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం…