- వాళ్లు చెప్పిందే ఫైనల్.. లేదంటే బెదిరింపులు
 - న్యాయం చేయాలంటూ బాధితుల మొర
 - అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
 - అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం
 - ఎలాంటి సమాచారం లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ
 - ఏర్దనూర్ లో భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన
 
మైనింగ్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. క్రషర్ మిల్లు పేరిట తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు వాపోతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఏర్దనూర్ గ్రామంలోని సర్వే నంబర్ 231, 259లో మొత్తం 45 ఎకరాలు ఉండగా 2005లో నాటి ప్రభుత్వం 80 మంది నిరుపేదలకు కేటాయించింది. అప్పటి నుంచి ఈ భూమినే నమ్ముకొని జీవిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో మైనింగ్ పెరిగిపోవడంతో అందుకు అవసరమైన భూమిని సదరు క్రషర్ యాజమాన్యాలు బలవంతంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా లీజు కోసమని ఎంతో కొంత ముట్టజెప్పి ఆ తర్వాత తమ పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. వినకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. సమస్యపై అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా తమకు చేయాలని వేడుకుంటున్నారు.
తమకున్న కొద్దిపాటి భూమినే ఆధారంగా బతికే నిరుపేద రైతులకు అన్యాయం జరుగుతున్న ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. క్రషింగ్ పేరిట బలవంతంగా లీజుకు తీసుకుంటున్నామని చెప్పి వారి భూములను తమ పేర రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా వారిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 మైనింగ్ యాజమాన్యం చెప్పిందే ఫైనల్…
    సంగారెడ్డి జిల్లా కంది మండలం ఏర్దనూర్ గ్రామంలోని సర్వే నంబర్ 231, 259లో మొత్తం 45 ఎకరాలు ఉన్నది. ఈ భూమిని 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడి ప్రాంతంకి చెందిన 80 మంది నిరుపేద కుటుంబాలకు వారి ఆసరా కోసం కేటాయించింది. అప్పటి నుండి ఆ గ్రామ రైతులు ఈ భూమినే ఆధారంగా చేసుకొని బతుకుతున్నారు. కానీ ఈ గ్రామం చివర్లో మైనింగ్ పెరిగిపోవడంతో అందుకు అవసరమైన భూమిని సదరు క్రషర్ యాజమాన్యాలు బలవంతంగా వారి నుంచి తీసుకుంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత క్రషింగ్ కోసం అని చెప్పి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వారికి తెలియకుండానే ఆ భూమిని తమ పేర రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రైతులకు చెందిన భూమిని వారు కోరిన విధంగా నష్టపరిహారం చెల్లించి ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదంటూ ఆ రైతు కుటుంబాలు చెబుతున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా విలువ 7,50,000 ఉండగా అందుకు నాలుగు రెట్లు అధికంగా కలిపి చెల్లిస్తే భూములు ఇవ్వడానికి తాము సిద్ధమని రైతులు చెబుతున్నారు. అలా కాకుండా రెండు మూడు లక్షలు చేతిలో పెట్టి విలువైన భూములను బలవంతంగా మైనింగ్ యజమానులు లాక్కోవడం న్యాయం కాదంటూ ప్రశ్నిస్తున్నారు.
 న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు…
    క్రషర్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న నిరుపేద రైతు కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ ఆరు నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా కూడా ఏ ఒక్క అధికారి తమను పట్టించుకొని న్యాయం చేయడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం.
 ఎలాంటి సమాచారం లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ…
    ఏర్దనూర్ గ్రామ శివారులో ఈ నెల 28న మరో క్రషింగ్ ఏర్పాటు కోసం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపడుతున్న విషయాన్ని ఏ ఒక్క మీడియాకు కనీస సమాచారం కూడా అధికారులు ఇవ్వలేదు. సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తే అది మా శాఖ పరిధి కాదంటూ రెవెన్యూ శాఖకు చెందిన అధికారి బదులిచ్చారు. మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానంతరం బాధిత కుటుంబాలు సంగారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడే కలెక్టర్ ను కలిసి తమ గోడును చెప్పుకోవాలని వెళ్లగా కలెక్టర్ లేకపోవడంతో అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అక్కడ క్రషింగ్ చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

 న్యాయమైన పరిహారమే ఇస్తున్నాం…
    ఏర్దనూర్ లో ప్రభుత్వం క్రషింగ్ కోసం ఇచ్చిన భూమిలో బాధిత కుటుంబాలకు న్యాయపరమైన పరిహారాన్ని వారికి చెల్లిస్తున్నాం. మొత్తం 55 మందిలో 40 మందికి పరిహారం ఇప్పటికే అందించాం. మిగతా వారికి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ స్థానికంగా ఉన్న కొంతమంది లీడర్లు మిగతా కుటుంబాలకు అధిక డబ్బులు వస్తాయంటూ ఆశ చూపి మోసం చేస్తున్నారు. మేము అన్ని ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ఇక్కడ పనులు చేస్తున్నాం. -క్రషింగ్ యాజమాన్యం (సోర్స్: దిశ)