ఔట్‌ సోర్సింగ్ : ఆధునిక బానిసత్వం

నేటిబూర్జువా సమాజం ఒక బానిసత్వపు ‘వృత్తి వ్యవస్థను’ సృష్టించింది. అదే ‘ఔట్‌ సోర్సింగ్ లేదా కాంట్రాక్టీకరణ’. నేడు అమలవుతున్న ఈ విధానం ద్వారా ఉపాధి పొందిన వారు జీవితాంతం అదే పనికి పరిమితమై ఎలాంటి పదోన్నతులూ, ఉపాధి భద్రతా లేకుండా ఊడిగం చేస్తున్నారు. యాజమాన్యాలకు చీకూచింతా లేకుండా కావలసిన పని మధ్యవర్తుల ద్వారా తక్కువ ఖర్చుకే జరుగుతుండటంతో ఈ వ్యవస్థ రోజురోజుకూ వేళ్లూనుకుంటోంది.

ఒక కులానికి, ఒక పరిమితమైన వృత్తిని మాత్రమే నిర్దేశించి మిగతావాళ్ళకి సహాయపడే వృత్తిలా చేయడం, తద్వారా వారిలో ఎలాంటి పురోభివృద్ధీ లేకపోవడంతో అంబేడ్కర్‌ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. ఒక కులంపై విధించిన వృత్తిపరమైన నిషేధాల వల్ల అనేకమంది చదువుకు నోచుకోక ఎన్ని తెలివితేటలున్నా వంశపారంపర్య వృత్తినే చేపట్టి, పేదరికంలో మగ్గి అంతరించారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పని చేయించుకునే ప్రధాన యజమానితో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు అవకాశం లేకపోవడంతో సదరు యజమానిని ఎలాంటి డిమాండ్లు, నష్టపరిహారం లేదా సౌకర్యాల పెంపుదలను కోరే అవకాశం వారికి చట్టరీత్యా లేదు. ఉద్యోగులను నియమించిన కాంట్రాక్టరు కమిషన్ తీసుకుంటాడు గానీ ఉద్యోగికి పని ప్రదేశాల్లో జరుగుతున్న దోపిడీతో తనకు సంబంధమే లేదంటాడు. అటు కాంట్రాక్టరు, ఇటు సంస్థ… ఎవ్వరితోనూ చట్టపరమైన చుట్టరికంలేని ఔట్‌ సోర్సింగ్ వ్యవస్థ ఒక బానిసత్వానికి ఉదాహరణ.

ప్రభుత్వంలో నాలుగవ తరగతి ఉద్యోగుల నియామకాలు జరపకపోవడం వల్ల ఎన్ని విద్యార్హతలు, నైపుణ్యం ఉన్నా జీవితాంతం ఒక ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగిగానే ఎలాంటి పురోగతి లేకుండా ఉండాలి. గతంలో ప్రభుత్వ శాఖల్లో లేదా ప్రభుత్వరంగ సంస్థలలో నాలుగవ తరగతి ఉపాధిలో నియామకాలు పొందినవారు తమ విద్యార్హతలు, అనుభవం ఆధారంగా పదోన్నతులు పొంది పదవీ విరమణ నాటికి మెరుగైన స్థాయికి చేరుకునేవారు. ఒక ప్రభుత్వరంగ సంస్థలో అటెండర్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన వ్యక్తి, తాను ఎదుగుతున్న కొద్దీ, తన పిల్లలను మంచి చదువులు చదివించి, వారు మెరుగైన స్థాయిలో స్థిరపడేలా చేయగలడు. ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఇలా చేయడం అసాధ్యం.

ప్రభుత్వ రంగాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నియామకాలు చేపడితే వారు ప్రమోషన్లు పొంది, తాము పొందిన పదవికి న్యాయం చేయలేరని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అలాంటప్పుడు పదోన్నతులకు అర్హతలను, అనుభవాన్ని మార్పు చేసుకోవాలి కానీ పూర్తిగా ప్రమోషన్లే వద్దంటే ఎలా? నిజానికి ఉన్నత పదవులు పొందే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరిలోనూ ఒకే స్థాయి నైపుణ్యం ఉండదు, అలాగని వారికి ప్రమోషన్లు నిరాకరిస్తున్నారా?

నూతన ఆర్థిక విధానాల ఫలితంగా ఔట్‌ సోర్సింగ్ ద్వారా నియామకాలు మొదలయ్యాయి. మొదట్లో దీని ప్రభావం అంత కనిపించలేదు. అయితే రానురాను ఈ ఔట్‌ సోర్సింగ్ ఏజెన్సీల సంఖ్య, అందులో పని చేసే వ్యక్తుల సంఖ్య పెరిగిపోతున్నది. పర్మనెంట్ నియామకాలు లేకపోవడం, చదువుకు తగిన ఉపాధి దొరకకపోవడంతో బాగా చదువుకున్నవారు కూడా వాచ్‌మన్లుగా, అటెండర్లుగా చేరుతున్నారు. ఇక్కడ దీర్ఘకాలికంగా నష్టం చేసే రెండు మూడు అంశాలను పరిశీలించాలి. ఒకటి– కాంట్రాక్ట్ ద్వారా పనిచేస్తున్న వ్యక్తులందరికీ కేవలం రెండు మూడేళ్ల కన్నా ఎక్కువకాలం స్థిరమైన ఉపాధి లేక జీవితంలో అనిశ్చితి వెంటాడుతూ ఉంటుంది; రెండు– కాంట్రాక్టర్ మారినప్పుడు వేతనాలు పెరగొచ్చు లేదా తగ్గవచ్చు, ఉపాధి కొనసాగవచ్చు లేదా మరో కొత్త ఉపాధి వెతుక్కోవలసిన అవసరం ఏర్పడవచ్చు; మూడు– ఎంత నైపుణ్యం, విద్యార్హతలు, అనుభవం ఉన్నా ప్రమోషన్లు పొందే అవకాశం లేదు.

అందుచేత ఈ ఔట్‌ సోర్సింగ్ విధానం, కుల వ్యవస్థను మించిన ప్రమాదానికి దారితీస్తోంది. ఇది ప్రైవేటు రంగంలో మరి ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా విస్తరించి కంపెనీలు నేరుగా నియామకాలు చేసుకోకుండా ఔట్‌ సోర్సింగ్ ద్వారా కొంత పనిని మాత్రమే కాంట్రాక్టుకు ఇవ్వడం లేదా కొందరు వ్యక్తుల్ని తాత్కాలికంగా నియమించుకుంటున్నాయి. దీంతో ఉపాధిలో స్థిరత్వం లేక ఉద్యోగుల భవిష్యత్తు ప్రణాళికలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులను ఇలా దోపిడీ చేయడం, వారికెలాంటీ స్టాఫ్ రెగ్యులేషన్స్ అమలు జరగకపోవడం వల్ల జవాబుదారీతనం కూడా తక్కువే ఉంటుంది. చోరీలు జరిగిన అనేక చోట్ల వీరి పాత్ర కనిపించటం, అందరికన్నా ముందుగా వీరినే అనుమానించడం తరచూ చూస్తుంటాం. వారి ఉపాధిలోని అనిశ్చితే దీనికి కారణం. వెరసి ఒక స్థిరమైన సమాజ నిర్మాణం కాకుండా ఆటవిక న్యాయపు సమాజ నిర్మాణం వైపు మితిమీరిన ఈ ఔట్‌ సోర్సింగ్ ద్వారా అడుగులు పడుతున్నాయి. ఇది అనర్థదాయకం. జి. తిరుపతయ్య (సోర్స్: ABNఆంధ్రజ్యోతి)