ఇండస్ కేమ్ పరిశ్రమ సీజ్

  • ఫిర్యాదు దారుడి సమక్షంలో సీజ్ చేసిన అధికారులు
  • పొరాడి గెలిచిన స్థానిక గ్రామాల ప్రజలు

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ పంచాయతీ పరిధిలో ఇండస్ కేమ్ జిప్సం కంపెనీ ఎట్టకేలకు సీజ్ అయ్యింది.
కాలుష్య నియంత్రణ మండలి శాఖ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి గురువారం సీజ్ వేశారు.

హైదరాబాద్ కు చెందిన ఒకరు తాండూరు మండలం కరణ్ కోట పరిధిలో ఇండస్ కేమ్ పరిశ్రమను ఏడాదిన్నర క్రితం నెలకొల్పారు. తొలుత బొగ్గు, క్లింకర్ పరిశ్రమగా స్థానికుల్ని నమ్మించారు. దీనిలోకి పార్మా పరిశ్రమల నుంచి ద్రవ రూప వ్యర్థాలను తరలించారు.

నేలలోకి ఇంకించి.. పర్యావరణాన్ని దెబ్బతీసి..
వరి పొట్టుతో రసాయన వ్యర్ధాలను జేసీబీ యంత్రాలతో మిళితం చేశారు. వీటిని నేలలోకి ఇంకించడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. బోరు బావులతోపాటు గుంత బాస్పల్లి, మిట్ట బాస్పల్లిలోని తాగునీటి నల్లాల ద్వారా ఎర్ర రంగునీరు వచ్చింది. దీన్ని తాగిన గ్రామస్ధులు అస్వస్థతకు గురై అనారోగ్యాల బారిన పడ్డారు. పరిశ్రమ చుట్టూ మూడు కిలోమీటర్ల దాకా ముక్కు పుటాలు అదిరేలా దుర్వాసనతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడ్డారు. పరిశ్రమలో కొన్నిరోజులు పని చేసిన గుంతబాస్పల్లి గ్రామస్థులు వ్యాధుల బారిన పడ్డారు. దీంతో గ్రామస్థులు, సర్పంచి జగదీష్ ఆధ్వర్యంలో జనవరి 21 పరిశ్రమ ముందు బైఠాయించి ధర్నా చేశారు. పరిశ్రమను మూసివేయించాలంటూ అధికారులకు గ్రామస్ధులు, సర్పంచి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జిల్లా పాలనాధికారి, రెవెన్యూ, ఆర్డీఓ, తహసీల్దారు కార్యాలయాల్లో ఎన్నో రాతపూర్వక ఫిర్యాదులు చేశారు.

చివరగా గురువారం రోజు స్థానిక ప్రజలు, ఫిర్యాదు దారుడి సమక్షంలో సీజ్ వేసినట్లు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ బాలరాజ్, కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఇంజినీర్ సిద్ధార్థ తెలిపారు. వారు మాట్లాడుతూ.. కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాలతో సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా యాజమాన్యం కంపెనీని నడుపుతుందన్నారు. దీంతో గత నెల మార్చి 15న కంపెనీని 48 గంటలలోపు మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకుండా కాలయాపన చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకురావడంతో వారి ముందే సీజ్ చేసినట్లు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసి ఉంచాలని పేర్కొన్నారు. గుంత బాస్పల్లి సర్పంచ్ జగదీశ్, ప్రజలు తదితరులు ఉన్నారు.