* కార్మికుల ప్రాణాలతో ఆర్వీ పరిశ్రమ చెలగాటం
* బోర్డులు.. భద్రతా ప్రమాణాలు లేవు
* ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ కరువు
* యాజమాన్యం నిర్లక్ష్యంతో ముగ్గురు కార్మికులు మృతి
ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుగాంచిన పటాన్ చెరు నియోజకవర్గంలో పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం జరుగుతున్న ప్రమాదాలలో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పరిశ్రమల నిబంధనలను విస్మరిస్తూ కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో అమాయకులైన కార్మికుల బతుకులు అగ్నికి ఆహుతవుతున్నాయి. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న అటు యాజమాన్యాలు, ఇటు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశం మైలారం పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పాశం మైలారం పారిశ్రామిక వాడాలో ఆర్వీ పాలిమర్స్ పరిశ్రమలలో మూడు రోజుల కింద సంభవించిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు. ఒకే అవరణలో కనీస నిబంధనలు భద్రత ప్రమాణాలు పాటించకుండా రెండు పరిశ్రమలు ఒక వైపు ఇంజనీరింగ్, మరో వైపు పాలిమర్ పరిశ్రమలు నిర్వహిస్తూ ఉన్నారు. గత శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఆ సమయంలో పరిశ్రమలో 11 మంది పనిచేస్తుండగా 8 మంది బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ వద్ద పనిచేస్తున్న రమణ రెడ్డి(49), వెంకటేశ్వర రావు (49), సతీష్ (45) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో ప్రమాదం సంభవించిందని తెలుస్తుంది.
కనీస నిబంధనలు పాటించకుండా
ఈ పరిశ్రమలో కనీస భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, యాజమాన్య నిర్లక్ష్యం మూలంగా ముగ్గురు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోయాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు పరిశ్రమ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డ ఆసుపత్రికి తరలించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మంటలలో చిక్కుకుని తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే సమయంలో అంబులెన్స్ లేకపోవడంతో గాయపడ్డ కార్మికులు రోడ్డుపై నిలబడి ఆర్తనాదాలు చేస్తున్న ఘటన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలిన గాయాలతో అరుస్తూ రోడ్డుపై పరుగులు తీస్తున్న క్షతగాత్రులను అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ట్రాలీ ఆటోలో ఆస్పత్రికి తరలించడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు తూట్లు..
పాశం మైలారం పారిశ్రామిక ప్రాంతంలో చాలా కెమికల్ పరిశ్రమలు కనీస ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. శనివారం ప్రమాదం జరిగిన పరి శ్రమకు పెరు ఉన్న బోర్డు లేకపోవడం విడ్డురం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పరిశ్రమ ముందు పరిశ్రమ పేరు సూచించే బోర్డ్ తో పాటు అందులో తయారయ్యే రసాయన వివరాలతో పాటు కాలుష్య వివరాలను తెలియచేస్తూ డిస్ ప్లే బోర్డ్ లని ఏర్పాటు చేయాలి. కానీ చాలా పరిశ్రమలు ఆ నిబంధనలు. పాటించట్లేదు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణా నష్టాన్ని తగ్గించడానికి ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలి. కానీ చాలా పరిశ్రమలలో మచ్చుకైనా ప్రథమ చికిత్స కేంద్రాలు కనబడటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి ప్రత్యేక ఏర్పాట్లు. చెయ్యాలి. ఘటన జరిగిన పరిశ్రమలో ఈ ఏర్పాట్లు లేకపోవడంతో ఫైర్ ఇంజన్లు వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతూ అమాయక కార్మికుల బతుకులు మంటల్లో బుగ్గి అవుతున్నాయి..
నిర్లక్ష్యం ఖరీదు విలువైన ప్రాణాలు
చాలా పరిశ్రమలు కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి కాసులు సంపాదన లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా కెమికల్, ఫార్మా కంపెనీలు రియాక్టర్ల వద్ద పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలను సమకూర్చ డంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆర్.వి పాలిమర్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో రక్షణ పరికరాలు లేకపోవడంతో విలువైన ప్రాణాలు కోల్పోయారు. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. తయారు చేసిన రసాయనాన్ని
రియాక్టర్ లో వేసి ప్రాసెస్ చేస్తారు.(సోర్స్ : దిశ)
ఈ పరిశ్రమల ప్రమాదాల వెనుక ముఖ్యంగా పరిశ్రమల యజమాన్యాల నిర్లక్ష్య ధోరణితో పాటు కొంతమంది అవినీతి అధికారుల అలసత్వం స్పష్టంగా కనపడుతుంది. అవినీతి అధికారులు తప్పు చేసిన పరిశ్రమల వారిని కఠినంగా శిక్షించకపోవడం వల్ల ఇలాంటి అనేక సంఘటలు జరుగుతునాయి. ఈ అవినీతి అధికారులను ఉన్నతాధికారులు ముందు కఠినంగా శిక్షించాలి. అప్పుడే అధికారులు తప్పు చేస్తున్న పరిశ్రమలను దారికి తెస్తారు. లేదంటే ఇలాంటి సంఘటలు ఎన్ని జరిగిన ఫలితం మాత్రం శూన్యం. ముందు ఈ అవినీతి అధికారుల భరతం పట్టాలి. మా నిఘానేత్రం అధ్వర్యంలో త్వరలో కొంతమంది అవినీతి అధికారులు బాగోతం ప్రజల ముందుకు.. ఉన్నతాదికారుల దృష్టికి తీసుకువస్తాం. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ “మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం”…