గుట్టు చప్పుడు కాకుండా… భూగర్భంలోకి..

• ఒకప్పుడు పచ్చని వంట పొలాలతో కళ కళ…. ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కి విలవిల.
• ఎక్కడపడితే అక్కడే రసాయన వ్యర్థ్యాల పారబోత
• భూగర్భ జలాలు కలుషితం.. బోరు నీళ్లు విషతుల్యం
• పంటలు పండవు … పశువులు నీళ్లు తాగవు
• రసాయన పరిశ్రమల దుర్మార్గపు చర్యలతో ప్రమాదంలో పడిన ప్రజారోగ్యం

గంగ పొంగితే…ప్రతి గుండె ఉప్పొంగాలి. పరిశ్రమలు వస్తే… యువతకు ఉపాధి లభించాలి. కానీ… ఇక్కడి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు పచ్చని పంట పొలాలు… పాడి పంటలతో కళకళలాడిన యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు కాలుష్యపు కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాల ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ రెండు మండలాల్లో వెలసిన అనేక కాలుష్యకారక రసాయన పరిశ్రమల వల్ల భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి. బోరు బావులన్నీ కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి. ఫలితంగా వ్యవసాయ రంగం దెబ్బతిని పోయింది. పశు సంపద మృత్యువాత పడుతోంది. కులవృ త్తులు కుదేలవుతున్నాయి. ప్రజలకు జీవనోపాధి కరవైపోయింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండలాల్లో సుమారు 60 కి పైగా రసాయన పరిశ్ర మలు వెలిశాయి. ఉపాధికి బాటలు వేయాల్సిన పరిశ్రమలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర రసాయన వ్యర్థాలను ఇష్టమొచ్చిన రీతిలో ఎక్కడ పడితే అక్కడే పారబోస్తున్నారు. హానికారక వ్యర్థాలను శుద్ధి చేయకుండా గుట్టుగా రాత్రిపూట చెరువులు, కుంటలు, బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నీటి వనరులతో పాటు భూగర్భ జలాలన్నీ కాలకూట విషంలా మారిపోతున్నాయి.

ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
ఇక్కడి రసాయన పరిశ్రమల కాలుష్యంపై స్థానికులు, రైతులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదు. ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా హడావిడి చేసి చేతులు దులుపుకోవడం తప్ప.. ఏ ఒక్క పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు మచ్చుకైనా కనిపించడం లేదు. నిబంధనలు తుంగలో తొక్కి జనం పైకి విషం చిమ్ముతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవలసిన అధికారులే పరిశ్రమల యాజమాన్యాలు ముట్టజెప్పే ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పంటలకు పనికిరాని నీళ్లు
చౌటుప్పల్ ఇప్పుడు ఒక పారిశ్రామిక కేంద్రం. కానీ ఈ మండలంలోని భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోయాయని… ప్రమాదకరమైన పారిశ్రామిక వ్యర్థాలు భూమిలోకి ఇంకడం వల్లే పంటలు కూడా పండని విధంగా విషతుల్యమై పోయాయి. చౌటుప్పల్ మండలంలోని అనేక గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో అధికారులు ఇక్కడి పరిశ్రమల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా ఈ భయంకరమైన నిజం బట్టబయలైంది. రసాయన పరిశ్రమలు ఉన్నచోట్ల మాంగనీస్, నికెల్. సీసం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం, లక్కారం, కొయ్యలగూడెం, తంగడపల్లి జై-కేసారం… భూదాన్ పోచంపల్లి మండలంలోని దోతి గూడెం, సీతవానిగూడెం. అంతమ్మ గూడెం గ్రామాల్లో లీటరుకు 2000 ఎంజీలు ఉండాల్సిన టీడీఎస్ తీవ్రత 5000 ఎంజీల కంటే ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. 2015 లో 6400, 2016 లో 9500 ఆ తర్వాత బీఎస్ఐ నిర్దేశిత పరిమితుల కంటే ఎక్కువగా 12900 వరకు టీడీఎస్ తీవ్రత ఉన్నట్టు గుర్తించారు.

పరిశ్రమల పుణ్యమా అని…
రసాయన పరిశ్రమల పుణ్యమా అని ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితమై పోవడమే కాకుండా యువతి యువకుల వెంట్రుకలు సైతం తెల్లబడిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు అంతు చిక్కని వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. కాలుష్యం మనుషులకే కాకుండా…మూగ జీవాలను సైతం వెంటాడుతోందన్నారు. కాలుష్యం కారణంగా పత్తి పంట ఎదగడం లేదని.. పంటలు దెబ్బతిని ధాన్యం దిగుబడి తగ్గిపోతుందని వివరించారు. పాడి గేదెలకు చూడి నిలవడం లేదని రైతులు వాపోతున్నారు.(సోర్స్: దిశ)