• విషం చిమ్ముతున్న ఫ్యాక్టరీలు
• చెరువుల్లో కలుస్తున్న వ్యర్థాలు
• భూగర్భ జలాల్లోకి వ్యర్థ రసాయనాలు
• పంట పొలాలు కాలుష్యం
• విషతుల్యమవుతున్న గాలి
• శ్వాసకోస వ్యాధుల బారిన ప్రజలు
పారిశ్రామికీకరణ వెలుగుల వెనుక నిర్జీవమైపోతున్న పల్లెల గోడు ఇది. పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు దక్కి.. యువతకు చేదోడుగా ఉంటుందని ఆశించినా.. కాలుష్య కాసారాలతో పల్లెల ఉనికే దెబ్బతినే స్థితికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా రసాయన వ్యర్థాలను గ్రామాల సమీపాన వదులుతుండటంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఫలితంగా ఆయా ప్రాంత ప్రజలు శ్వాసకోస వ్యాధులు, కీళ్ల నొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి రకరకాల వ్యాధులతో అల్లాడుతున్నారు. రసాయన పరిశ్రమలు పెడితే భూములు పాడవుతాయని.. ఉపాధి కోల్పోతామని ప్రతిఘటించిన ప్రజలు నేడు మా ప్రాణాలు కాపాడండి మహా ప్రభో… అంటూ వేడుకుంటున్నారు. ఇదీ రసాయన పరిశ్రమలు వెలిసిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాల్లోని ప్రజల దుర్భర పరిస్థితి.
ఎక్కడా లేని విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ సంఖ్యలో ఔషధ రసాయన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తుల ద్వారా ఘన, జల వ్యర్థ రసాయనాలు వెలువడుతుంటాయి. తక్కువ గాఢత ఉన్న వ్యర్థ రసాయనాలను మల్టీపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు (ఎంఈఈ) ఆర్వోలతో శుద్ధి చేయాలి. ఇలా శుద్ధి చేసిన వ్యర్ధాలను మాత్రమే బయటికి వదలాలి. గాఢత ఎక్కువగా ఉంటే జీడిమెట్ల, పటాన్ చెరు లోని ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించాలి. ఘన వ్యర్థాలను దుండిగల్ లోని డంపింగ్ యార్డ్ కు పంపించాలి. కానీ రసాయన వ్యర్థాలను ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేయించాలంటే పరిశ్రమల యజమానులకు ఖర్చుతో కూడుకున్న పని, ఒక్కో ట్యాంకర్ కు రూ.10 నుంచి రూ. 15 వేల వరకు వెచ్చించాల్సి ఉంటుందనే నెపంతో పరిశ్రమల నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు.
రాత్రుళ్లు ట్యాంకర్లలో తరలింపు…
పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయడానికి బదులు అర్ధరాత్రి ట్యాంకర్లలో బయటికి తరలిస్తున్నారు. ఇందుకోసం చౌటుప్పల్ ప్రాంతంలో ట్యాంకర్ల యజమానులే ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా సభ్యులు మాఫియాను తలపించే రీతిలో పని చేస్తూ పరిశ్రమల మెప్పు పొందుతున్నారు. ఈ ముఠా సభ్యులు వ్యర్థ రసాయనాలను తరలించే ట్యాంకర్ల వెంట ఎస్కార్టులుగా వ్యవహరిస్తూ వ్యర్థాల పారబోతను సునాయాసంగా పూర్తి చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. పరిశ్రమల నుంచి అర్థ రాత్రి పూట బయలుదేరే ఈ ట్యాంకర్లను నిర్జన ప్రదేశాల్లో… బీడు భూముల్లో ఆపి వ్యర్థాలను పారబోసి వెళ్తున్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమై తాగునీటి కలుషితం, పంటపొలాలు సైతం మాడిపోయాయి. స్వచ్ఛమైన గాలి విషతుల్యమవుతోంది.
భూగర్భంలోంచి పైపు లైన్లు
యాదాద్రి భువనగిరి జిల్లా చుట్టూ వెలిసిన ఔషధ పరిశ్రమల నిర్వా హకులు కొందరు వ్యర్ధ జలాలను మళ్లించడానికి ఇటీవల కొత్త పంథాను ఎంచుకున్నారు. పరిశ్రమ పరిసరాల్లోనే గొట్టపు బావులు తవ్వించి ఆ వ్యర్థాలను అందులోకే వదిలేస్తున్నారు. మరి కొందరైతే భూమిలోంచి పైపులైన్లు వేసి కాలువల్లో కలిపేస్తున్నారు.(సోర్స్: దిశ)
