పీసీబీ కదులుతుందా.. కాలుష్యం వదులుతుందా..

పీసీబీకి చెందిన కేసులు పెరుగుతున్నాయి. విధులు సరిగా నిర్వర్తించకపోతే పీసీబీ ఉండి ఏం లాభం. ఇలాగైతే పీసీబీని మూసివేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం.. ఫిర్యాదు చేసిన ప్రజలను పట్టించుకోకుండా, వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. – రాష్ట్ర హైకోర్టు

కాలుష్య నియంత్రణ మండలి పని తీరు ప్రశ్నార్ధకమవుతోంది. తాజాగా రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి జిల్లాలో కాలుష్య కారక పరిశ్రమలపై వందలాది మంది ఫిర్యాదులు చేసినా ఫలితం దక్కలేదు. ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండానే బుట్టదాఖలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా పీసీబీ కదిలి కాలుష్యాన్ని వదిలిస్తుందేమో చూడాలి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్ చెరు, జిన్నారం, మనోహరాబాద్, చేగుంట, చిన్నశంకరంపేట, తూప్రాన్, నంగునూరు తదితర మండలాల్లో పరిశ్రమలు వెలిశాయి. రసాయన పరిశ్రమల నిర్వాహకులు అదును చూసి వర్షాలు కురిసినప్పుడు, జలవనరుల్లోకి రాత్రి వేళల్లో వ్యర్ధ జలాలను ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. మరికొంతమంది పొగ వెదజల్లుతూ ప్రజల ఆరోగ్యంతో ఆటాడుతున్నారు. మరోవైపు పొలాల్లోకి కాలుష్య జలాలు చేరి సాగు చేయలేని పరిస్థితి నెలకొంటది. ఈ పరిస్థితుల్లో హైకోర్టు వ్యాఖ్యలు ఊరటనిచ్చేవే.

బుట్టదాఖలే…
ఎన్ని ఫిర్యాదులు వచ్చినా బుట్టదాఖలే అవుతున్నాయి. ఇందుకు ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో పాటు అవినీతి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు.. ఏదైనా పరిశ్రమ కాలుష్య కారకమని తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలి. నమూనాల సేకరణ. విచారణ అంటూ కాలయాపన చేస్తున్నారు. పారిశ్రామిక వాడలవారీగా పీసీబీ కార్యాలయాలు ఏర్పాటు చేసి వారికే చర్యలు తీసుకునే అధికారం ఇస్తే కొంత వరికైనా సమస్య తీరే అవకాశం ఉంది.

ఇష్టానుసారంగా వదిలేస్తూ…
కాలుష్య కారక పరిశ్రమలపై స్థానికులు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. అప్పటికప్పుడు హడావుడి చేసి తర్వాత వదిలేస్తున్నారు.. కొన్ని ఫిర్యాదు ఇలా…

తేది: 31-08-2023 : జిన్నారం మండలం గడ్డపో తారంలోని గాల్వనైజింగ్ పరిశ్రమ నిబంధనలు పాటించడం లేదని పీసీబీ చర్యలు చేపట్టింది. వాటిని ఉల్లంఘించి యాజమాన్యం ఉత్పత్తులు చేయడంతో పాటు గురువారం భారీగా వ్యర్థాలను పారబోసింది. దీన్ని నియంత్రించకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తేది:08-08-2023 : రాత్రి వేళ ఐడీఏ బొల్లారంలోని రెండు పరిశ్రమలు రోడ్డు పైకి మోటార్లతో కాలుష్య జలాలు వాదులుతున్నారని బషీర్ అనే వ్యక్తి పీసీబీ అధికారులకు పిర్యాదు చేశారు. కనీసం దాన్ని పట్టించుకోలేదు.

తేది: 30-06-2023 : గడ్డపోతారంలోని ఆపెక్స్ పరిశ్రమ యూనిట్-1 నుంచి వ్యర్థాలను యూనిట్-2లో నిల్వ చేస్తున్నారని, వాన పడగానే కాలువ ద్వారా జిల్లెల వాగులోకి వదులుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. పీసీబీ అధికారులూ నిర్ధరించారు. మూతపడిన యూనిట్-2నే తిరిగి మూసివేసినట్లు ప్రకటించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తిరిగి ప్రారంభించాలని దరఖాస్తు చేశారని చెబుతున్నారు.
* ఇదే రోజు లూసెంట్ పరిశ్రమపై ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం.

తేది: 16-06-2023 : హత్నూర మండలం గుండ్లమాచునూర్ పరిధి ఆర్చ్ ఫార్మా, కోవాలెంట్, అరబిందో యూనిట్-9, ఆనార్ ల్యాబ్ పరిశ్రమల వాయు కాలుష్యంపై స్థానిక ఆదర్శ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్ధి కపిల సిద్ధార్థ గవర్నర్, హైకోర్టు, కలెక్టర్, జిల్లా కోర్టులతో పాటు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలకు వీవోసీ యంత్రాలు అమర్చి మూడు నెలలు కట్టడి చేశారు. ఆ తర్వాత మళ్లీ యథాస్థితి.

ఐదుసార్లు : పర్యావరణ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు భద్రేశ్ 2022 మే 30న ఈ ఏడాది (మార్చి 20, 29, జులై 31న, ఆగస్టు 8న సనతనగర్ లోని రామచంద్రాపురం జోనల్, సంగారెడ్డి ప్రాంతీయ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. చర్యలు మాత్రం శూన్యం.

ఆరు నెలల కిందట: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి, చెట్లగౌరారం గ్రామాల మధ్య ఎంఎస్ ఆగర్వాల్ పరిశ్రమ కాలుష్యంపై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. పరిశ్రమ విస్తరణకు ప్రజాభిప్రాయాలు సేకరించారు. రెండు గ్రామాల ప్రజలు వ్యతిరేకించినా అనుమతులు ఇచ్చారు.

రాజీపడం: కుమార్ పాఠక్, పీసీబీ ఈఈ, రామచంద్రాపురం
ప్రతి ఫిర్యాదుపై పీసీబీ చర్యలు తీసుకుంటుంది. తాజా సమస్యలపై దృష్టి పెడతాం. చిన్న సమస్య వదులుతున్నారని అయితే తీరు మార్చుకోవాలని సూచిస్తాం. పెద్దదైతే రాష్ట్ర కార్యాల యంలోని టాస్క్ ఫోర్సకు నివేదిస్తాం. కాలుష్య కట్టడి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. (సోర్స్: ఈనాడు)