- సబ్సిడీ కోసం లంచం డిమాండ్
- రూ.15 వేలు తీసుకుంటూ చిక్కిన ఆఫీసర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా ఇండస్ట్రియల్ మేనేజర్ గంగాధర శ్రీనివాస్ రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గుగులోతు లచ్చిరాం గత సంవత్సరం జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా రూ.53 లక్షలకు వ్యాన్ కొన్నారు. దీనికి సంబంధించిన సబ్సిడీ కోసం లచ్చిరాం కొద్ది రోజుల క్రితం జిల్లా పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ శాఖ ఆఫీసర్ శ్రీనివాస్.. లచ్చిరాం నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. మళ్లీ రూ.60 వేలు కావాలని డిమాండ్ చేయడంతో లచ్చిరాం ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లచ్చిరాం రూ.15 వేలను శ్రీనివాస్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
- ఏసీబీకి పట్టుబడ్డ ఇంజనీర్
- కారు అద్దె బిల్లు మంజూరుకు రూ.9 వేల లంచం డిమాండ్
నిజామాబాద్ జిల్లా పబ్లిక్ రిలేషన్ (డీపీఆర్వో) ఆఫీస్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ గా పనిచేస్తున్న చెల్లంగి వేణి ప్రసన్న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కోనేటి విజయ్ కుమార్ తన కారును డీపీఆర్వో ఆఫీసు అద్దెకు ఇచ్చారు. మూడు నెలల బిల్లు రూ.99 వేలు ఆయనకు రావాల్సి ఉంది. బిల్లు మంజూరు చేయాలని విజయకుమార్ డీఈఐఈ చెల్లంగి వేణి ప్రసన్నను కోరగా రూ.9 వేల “లంచం డిమాండ్ చేశారు. విషయాన్ని విజయ్ కుమార్ ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. నగదు తీసుకుంటున్న ప్రసన్న రెండ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఆనందకుమార్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. నిందితురాలిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు.