చిట్యాల శివారులోని ఐడీఎల్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని కెమికల్ ట్యాంకర్ పేలి విషవాయువులు బయటకు వ్యాపించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొరవడిన పర్యవేక్షణ, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ కంపెనీలో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులు మృత్యువాత పడటంతో పాటు గాయాలపాలయ్యారు. అయినప్పటికీ కంపెనీ నిర్లక్ష్యం వీడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా నామమాత్రంగా పర్యవేక్షణ చేస్తూ వెళ్లిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంపెనీ నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను అర్థరాత్రి పూట ట్యాంకర్ల ద్వారా స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేనిగూడెంలో పారబోస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కంపెనీ ద్వారా పారబోస్తున్న రసాయన వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతినడంతో పాటు ఆరోగ్యాలు పాడువుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
