పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇండ్లలో రెండో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఉన్న రాఘవా ప్రైడ్‌ ఆఫీస్‌తోపాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 17లో ఉన్న ఇండ్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంట్లో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన కుటుంబ సభ్యుల నుంచి పలు వివరాలు సేకరించారు.

గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, లాంకోహిల్స్‌, రాయదుర్గం, బషీర్‌బాగ్‌ ప్రాంతాలతోపాటు ఖమ్మం టౌన్‌, ఖమ్మం రూరల్‌, పాలేరు, స్వగ్రామం కల్లూరులోని నారాయణపురంలో పొంగులేటికి చెందిన కంపెనీలు, బంధువుల ఇండ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు, చెన్నైకి చెందిన 200 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలిసింది.