తెలంగాణ ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో ఉప సంహరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషన్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు 608 మంది అభ్యర్థులు బుధవారం నామినేషన్లను ఉప సంహరించుకోగా.. 2,290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. అత్యధికంగా ఎల్‌బీనగర్‌లో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు పేర్కొంది. అత్యల్పంగా నారాయణపేట, బాన్స్‌వాడ నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీలు ఉన్నట్లు చెప్పింది. సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

అలాగే మనుగోడులో 39 మంది, పాలేరులో 37 మంది బరిలో ఉన్నారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెట్‌ నియోజకవర్గంలో పది మంది పోటీలో ఉన్నారు. అయితే, ఎన్నికల సందర్భంగా 2,898 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఈసీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకు 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు. మరో వైపు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సైతం పలువురు అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షోలు నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.