ఇది కేవ‌లం స్పీడ్ బ్రేక‌ర్ మాత్ర‌మే.. బాధ్య‌త‌గా ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తాం : కేటీఆర్

 ఈ రాష్ట్రంలో త‌మ‌కు ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల‌ని ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. స‌మ‌ర్థ‌వంతంగా, బాధ్య‌త‌గా ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

గ‌త 100 రోజులుగా దాదాపు ఆగ‌స్టు 21న కేసీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌టించిన త‌ర్వాత నేటి వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు అహ‌ర్నిశ‌లు, ఎన్నో ర‌కాలు ప్ర‌య‌త్నాలు చేసి శ్ర‌మించి గెలుపు కోసం చాలాచాలా క‌ష్ట‌ప‌డ్డారు. వారికి హృద‌య‌పూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. 60 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి శ్ర‌మించిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితం రాలేదు. గ‌తం కంటే మంచి మెజార్టీ సాధిస్తామ‌నే ఆశాభావంతో ఎన్నిక‌ల‌కు వెళ్లాం. కానీ అనుకున్న ఫ‌లితం రాలేదు. కార‌ణాల‌ను స‌మీక్షించుకుంటాం. 119 అసెంబ్లీ స్థానాల‌కు గానూ 39 స్థానాలు ఇచ్చి ఒక ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల‌ని ప్ర‌జ‌లు ఆదేశించారు. ఆ పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగా, బాధ్య‌త‌గా నిర్వ‌హిస్తాం. ప‌దేండ్లుగా ప్ర‌భుత్వాన్ని ఎంత స‌మ‌ర్థ‌వంతంగా, విశ్వాసంగా సేవ‌లందించామో అదే ప‌ద్ధ‌తుల్లో ఈ కొత్త ప్రాత కూడా నిర్వ‌ర‌స్తిస్తాం. ఈ ఎదురుదెబ్బ‌ను ఒక గుణ‌పాఠంగా తీసుకొని, నేర్చుకోవాల్సిన నేర్చుకుని ముందుకు సాగుతాం అని కేటీఆర్ తెలిపారు.

రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ స‌హ‌జం..

మాకు 23 ఏండ్ల‌లో ఎన్నో ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. అనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ల‌క్ష్యాన్ని సాధించాం. ప్ర‌జ‌ల ద‌యతో రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చాం. ఈ ప‌దేండ్లు చేసిన ప‌ని ప‌ట్ల సంతృప్తి ఉంది. ఇవాళ ఫ‌లితాలు కొంత నిరాశ ప‌రిచినా బాధ, అసంతృప్తి లేదు. రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ స‌హ‌జం. మ‌నం అంద‌రం కూడా కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ మ‌న్న‌న పొంద‌డానికి విశేష‌మైన కృషి చేశారు. ఈ సంద‌ర్భంగా శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా. కార్య‌క‌ర్త‌ల పోరాట ఫ‌లితం కార‌ణంగానే ఇంత దూరం వ‌చ్చాం అని కేటీఆర్ తెలిపారు.

ప్ర‌జా గొంతుకై ప్ర‌శ్నిస్తాం..

ఇవాళ ప్ర‌తిప‌క్ష పాత్ర‌లో కూడా అల‌వోక‌గా ఇమిడిపోతాం. ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌జ‌ల గొంతుకై ప్ర‌శ్నిస్తాం. మాకు అడుగు అడుగునా అండ‌గా నిల‌బ‌డ్డ‌, స‌హ‌క‌రించిన ప్ర‌భుత్వ ఉద్యోగులు, అధికారుల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ఆ బాధ‌ను దిగ‌మింగి, అంతే వేగంగా ప్ర‌జ‌ల మ‌న్న‌న తిరిగి పొందుదాం. గ‌తంలో కంటే రెట్టింపు క‌ష్టం చేస్తాం. ఎవ‌రూ నిరాశ‌కు లోను కావొద్దు. ఇవ‌న్నీ రాజ‌కీయాల్లో స‌ర్వ సాధార‌ణ‌మే అని కేటీఆర్ పేర్కొన్నారు.

మా పార్టీ త‌ర‌పున కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్ష‌లు..

ఇవాళ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. వారికి కూడా మా అభినంద‌న‌లు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. మా పార్టీ త‌ర‌పున కూడా కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్ష‌లు. నిర్మాణ‌త్మ‌కంగా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం ముందుకు పోతాం. కొత్త ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేయం. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకుంటార‌ని ఆశిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇది ఒక ఎదురు దెబ్బ మాత్ర‌మే..

ఎవ‌రూ ఏ ప‌రిస్థితుల్లో కార్య‌క‌ర్త‌లు అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణ ప్ర‌జ‌ల శ్వాస‌గా కొన‌సాగించిన ప్ర‌స్థానాన్ని మ‌రింత ధృఢ సంక‌ల్పంతో ముందుకు పోదాం. ఇవాళ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం, మెద‌క్ జిల్లా అండ‌గా నిల‌బ‌డింది. కొన్ని చోట్ల స్వ‌ల్ప తేడాతో మా అభ్య‌ర్థులు ఓట‌మి పాల‌య్యారు. అనూహ్యంగా మా మంత్రులు కూడా ఓడిపోయారు. ఇది కేవ‌లం ఒక చిన్న స్పీడ్ బేక‌ర్, ఎదురు దెబ్బ మాత్ర‌మే. దీనికి నిరాశ‌ప‌డొద్దు, కుంగిపోవాల్సిన అవ‌స‌రం లేదు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి పోరాటం చేద్దాం. స‌మీక్ష‌లు చేసుకుని, మార్పులు చేర్పులు చేసుకుందాం అని కేటీఆర్ చెప్పారు.