ముగిసిన సీఎల్పీ సమావేశం.. సీఎం ఎంపిక బాధ్యత హైకమాండ్‌కు

కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ సభ్యులు ఏక వాక్య తీర్మానం చేశారు. ఈ ఏక వాక్య తీర్మానాన్ని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టగా.. తుమ్మల నాగేశ్వర్‌రావు, భట్టి విక్రమార్క సహా ఇతర నేతలు ఆ తీర్మానాన్ని బలపర్చారు. ఈ నేపథ్యంలో మరో రెండు గంటల్లో కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎం పేరును ప్రకటించనుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. మొత్తం 119 స్థానాలకుగాను 64 స్థానాల్లో గెలిచి అధికారం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సీఎంను ఎన్నుకునేందుకు ఇవాళ ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ తీర్మానం చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకు తీర్మానం తెలుపుతూ సీఎల్పీ మరో తీర్మానం చేసింది.