లంచం అడిగిన అధికారికి నోట్ల దండతో సన్మానం

  • జగిత్యాలలో వినూత్న ఘటన
  • అధికారిపై చర్యలు తీసుకోవాలి
  • ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు

చేపల సొసైటీలను విభజించేందుకు లంచం అడిగిన జగిత్యాల జిల్లా ఫిషరీస్‌ అధికారి దామోదర్‌కు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్‌ నోట్ల దండతో సన్మానం చేసి నిరసన తెలిపిన ఘటన సోమవారం జగిత్యాలలో జరిగింది. కథలాపూర్‌ మండలం రంగాపూర్‌ మత్స్యపారిశ్రామిక సహకార సంఘం పరిధిలో కల్వకోట, భీమారం, బొమ్మెన గ్రామాలు ఉన్నాయి. ఇందులో నుంచి భీమారం గ్రామాన్ని విడదీసి కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలని మత్స్యకారులు మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌కు చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్‌ను సంప్రదించారు. ఆయన మత్స్యకారులతో కలిసి జిల్లా ఫిషరీస్‌ అధికారి దామోదర్‌ను కలిశారు. అయితే సంఘం సపరేషన్‌ కోసం కోర్టుకు వెళ్లి ఆర్డర్‌ తెచ్చుకోవాలని ఆయన సూచించారు. దీంతో మత్స్యకారులు కోర్టుకు వెళ్లి ఆర్డర్‌ తెచ్చుకోవటంతోపాటు ఉత్తర్వుల కాపీని అధికారికి అందజేశారు.

ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన మత్స్యకారులకు స్కిల్‌ టెస్ట్‌ పెట్టి సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అధికారి, ఇక్కడే వక్రబుద్ధి చూపాడు. సంఘం ఏర్పాటు చేసేందుకు ఓ మధ్యవర్తితో మత్స్యకారుల నుంచి రూ.50 వేలు వసూలు చేశాడు. ఇంతలో ఎలక్షన్‌ కోడ్‌ వచ్చి ప్రక్రియ ఆగిపోయింది. లంచం గురించి ప్రవీణ్‌కు తెలియటంతో ఏసీబీ దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న దామోదర్‌.. ప్రవీణ్‌కు కాల్‌ చేసి బెదిరించాడు. దీంతో సోమవారం మత్స్యకారులంతా కలిసి జగిత్యాలలోని దామోదర్‌ వద్దకు వెళ్లారు.

సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించగా, తన సిబ్బందితో బయటికి గెంటివేయించారని వారు తెలిపారు. అటు నుంచి అటే.. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి వెళ్లి దామోదర్‌ లంచం డిమాండ్‌ చేశారని, ఏసీబీకి ఫిర్యాదు చేస్తే అంతుచూస్తానని బెదిరిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసే సమయంలో మత్స్యశాఖ జిల్లా అధికారి దామోదర్‌ కూడా అక్కడే ఉండటంతో ప్రవీణ్‌.. నోట్లతో చేసిన దండను అతని మెడలో వేసి నిరసన తెలిపారు. కాగా, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఫిర్యాదుపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా తెలిపారు.