ఆటోనగర్‌లో కెమికల్‌ దుర్వాసన

  • బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
  • ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

ఆటోనగర్‌ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న కెమికల్‌ దుర్వాసనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధి హిమపురికాలనీ ఫేజ్‌-1, 2, సెవన్‌ హిల్స్‌ కాలనీ, డీపీనగర్‌, ద్వారకానగర్‌, ఆటోనగర్‌ డంపింగ్‌ యార్డు తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ నిర్వహించిన ఆయన అక్కడి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. నూతన రోడ్లు, యూజీడీ, ట్రాన్స్‌ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, కాలనీల్లో విపరీతంగా ఉన్న కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని కాలనీలవాసులు ఎమ్మెల్యేను కోరారు.

అదేవిధంగా గత సంవత్సరం మాదిరిగానే తిరిగి మళ్లీ ఆటోనగర్‌ పారిశ్రామిక వాడ నుంచి కెమికల్‌ దుర్వాసన వస్తుందని.. కెమికల్‌ దుర్వాసనతో ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటోనగర్‌ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న కెమికల్‌ దుర్వాసనపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఐలా వారికి ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరింపజేస్తానన్నారు. ఆటోనగర్‌ డంపింగ్‌ యార్డు ప్రాంతంలో వేస్తున్న జంతు కళేబరాల డంపింగ్‌ను అరికట్టేందుకు నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆటోనగర్‌ పారిశ్రామిక వాడ నుంచి దిగువకు వరదనీరు వెళ్లేందుకు రూ.7 కోట్లతో ట్రంకులైన్‌ ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జక్కిడి మల్లారెడ్డి, పోచబోయిన జగదీశ్‌ యాదవ్‌, బాలరాజు, సిద్దగోని జగదీశ్‌ గౌడ్‌, మార్గం రాజేశ్‌, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.