అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయంలో ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను రేవంత్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు కలిపి ఒకే దరఖాస్తు రూపొందించినట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఈ పథకాలకు గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు. ఎనిమిది పని దినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. జనవరి 7వ తేదీ లోపు లబ్దిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తామని చెప్పారు. ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారని, ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారని పేర్కొన్నారు. ఇక రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హులైన వాందరికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. రైతుబంధుకు ఎలాంటి పరిమితి విధించలేదని సీఎం స్పష్టం చేశారు.
అప్పుడే ఉద్యోగ నియామకాలు
ఏడాది లోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్త బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యులను నియమిస్తాం. అనంతరం ఉద్యోగ నియామకాలు చేపడుతామన్నారు. గ్రూప్-2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ పేర్కొన్నారు.