లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పర్యావరణ ఇంజినీరు చంద్రకాంత్ నాయక్ కు జైలు శిక్ష

లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ప్రభుత్వ శాఖకు సంబంధించిన పోల్యుషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన పర్యావరణ ఇంజనీరు ముదావత్ చంద్రకాంత్ నాయక్ కు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ శుక్రవారం తీర్పు వెల్లడించారు.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం…. నిజామాబాద్ లోని గజానన ఆగ్రోమిల్స్ సంస్థకు పొల్యూషన్ లైసెన్స్ తీసుకునేందుకు సంస్థ ప్రతినిధి హరీష్ కుమార్ 2010 జులై 17న నిజామాబాద్ లోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ఆశ్రయించారు. అప్పటి నిజామాబాద్ పర్యావరణ ఇంజినీరుగా పనిచేస్తున్న ముదావత్ చంద్రకాంత్ నాయక్ లైసెన్స్ జారీ చేయడానికి రూ.75 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వలేనని బాధితుడు వెళ్లిపోయారు. మరోసారి అక్టోబరు 7న అదే ఇంజినీరును సంప్రదించగా రూ.50 వేలు ఇవ్వాలని అడిగాడు. బాధితుడు అక్టోబరు 8న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ని సంప్రదించారు. ఆయన సూచన మేరకు హరీష్ కుమార్ రూ.25 వేలు తీసుకెళ్లి వారి కార్యాలయంలో చంద్రకాంత్ నాయక్ కు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ, సీఐలు వెంకటేశ్వర్లు, సైదులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ కుమార్ వాదించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. హైదరాబాద్ తార్నాకలో నివాసం ఉంటున్న చంద్రకాంత్ నాయక్ ప్రస్తుతం సనత్ నగర్ లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయంలో EE గా విధులు నిర్వహిస్తున్నారు.