• పటాన్ చెరులో అక్రమ దందాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
• లకుడారం క్రషర్లపై అధికారుల మూకుమ్మడి దాడులు
• అడ్డగోలు తవ్వకాలు చూసి ఆశ్చర్యం
• ఆర్థిక లావాదేవీలు, పన్ను ఎగవేత లెక్కలపై ఆరా
• భారీ స్థాయిలో పేలుడు పదార్థాల స్వాధీనం
• ముగ్గురు అరెస్ట్, సిబ్బంది పరుగులు
• పరారీలో క్రషర్ యజమానులు..
• ప్రభుత్వ అధికారుల అవినీతిపై స్పెషల్ ఫోకస్..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యాంగ రెచ్చిపోయిన క్రషర్ల యాజమాన్యాలపై ప్రస్తుత సర్కార్ కఠినంగా వ్యవహరించడానికి సిద్దమైంది. క్రషర్ల వెనకాల జరుగుతున్న అక్రమాలపై రేవంత్ సర్కార్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేసి క్రషర్ యాజమాన్యాల అక్రమాలు, పన్ను ఎగవేత, కేటాయించిన స్థలాన్ని మించి మైనింగ్ చేయడంతో పాటు పక్కన ఉన్న భూముల్ని కబ్జా చేయడంపై సీరియస్ గా దృష్టి పెట్టింది. ప్రధానంగా ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న వాయు కాలుష్యం అధిక లోడింగ్, నిషేధిత బ్లాస్టింగ్ పై నిఘా పెట్టి ప్రత్యేక బృందాలతో దాడులు మొదలు పెట్టింది. అధికారుల మూకుమ్మడి దాడులతో విస్తుపోయే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రషర్ల యజమానుల అడ్డగోలు తవ్వకాలు, నిబంధనల విస్మరణను చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
పటాన్ చెరు నియోజకవర్గంలోని క్రషర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పటాన్ చెరు మండల పరిధిలోని లకుడారం గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న క్రషర్ల అక్రమాలపై విచారణ షురూ చేశారు. ఇందులో భాగంగా అక్రమ మైనింగ్ తో పాటు పన్ను ఎగవేత, ఓవర్ లోడింగ్ పై నిఘా పెట్టడంతో పాటు ప్రత్యేక పోలీసు బృందాలు లకుడారంలో క్రషర్ల పై ఆకస్మిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో పీఎంఅర్ క్వారీ నుంచి గుట్టలు పేల్చడానికి వినియోగించే నిషేధిత పేలుడు పదార్థాలను(జిలేటిన్ స్టిక్స్) పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని యాజమాన్యాలపై కేసులు నమోదు చేసింది.
నిబంధనలకు పాతర…
పటాన్ చెరు మండలం లకుడారం పరిధిలో నడుస్తున్న క్రషర్ల యాజమాన్యాలు విచ్చల విడిగా అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తున్నాయి. తవ్వకాల నుంచి మొదలుపెట్టి అక్రమ మైనింగ్ చేస్తూ పక్కన ఉన్న భూముల్ని సైతం చేరబట్టడం, పన్ను ఎగవేత, తప్పుడు లెక్కలు, అక్రమ బ్లాస్టింగ్, హెవీ లోడింగ్ వరకు అక్రమాల పరంపర కొనసాగుతుంది. క్రషర్ల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కడంతో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో లకుడారంతో పాటు చుట్టూ పక్కల గ్రామస్తులు, పశుపక్ష్యాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నిషేధిత జిలేటిన్ స్టిక్స్ తో పాటు మరికొన్ని పేలుడు పదార్థాలను వినియోగిస్తూ బ్లాస్టింగ్ జరపడంతో పెద్ద ఎత్తున దుమ్ము పంటలపై పేరుకుపోవడంతో పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. శబ్ద కాలుష్యంతో గ్రామంలోని ప్రజలు ఇబ్బందులు పడటమే కాకుండా గ్రామంలోని గృహాలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. వాయు కాలుష్యంతో ప్రజలు శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతున్నారు. దానికి తోడు అధిక ధనార్జనే లక్ష్యంగా ఓవర్ లోడ్ తో వాహనాలను నడుపుతుండడంతో దుమ్ముతో పాటు అతి వేగం కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. తమకు కేటాయించిన భూముల్లో అనుమతికి మించి ఎక్కువ లోతుకు మైనింగ్ జరపడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయి. అనుమతులకు మించి అక్రమ మైనింగ్ తో ప్రభుత్వానికి పన్ను ఎగవేయడంతో పాటు దొంగ పత్రాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతో లకుడారం గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న, నిబంధనల విస్మరణల పట్ల ఫిర్యాదులు చేసిన సదరు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో అవినీతికి అలవాటుపడ్డ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు. అధికార యంత్రాంగం వైఖరితో క్రషర్ యాజమాన్యాలు ఇష్ట రీతిగా రెచ్చిపోయి వందల కోట్ల ఆక్రమలకు పాల్పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమాలపై కొరడా..
గత ప్రభుత్వాల హయాంలో లకుడారం క్రషర్లలో జరిగిన విచ్చలవిడి మైనింగ్ అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి మైనింగ్ హాబ్ గా ఉన్న పటాన్ చెరు ప్రాంతంలోని క్రషర్ల అక్రమలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రషర్లలో సింహభాగం గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు సంబంధించినవి కావడంతో గతంలో జరిగిన పన్ను ఎగవేత, మోతాదుకు మించి మైనింగ్ జరిగిన ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తుంది. దీనికోసం ప్రత్యేక బృందాలను పంపి పర్యవేక్షస్తుంది. గత వారం రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం క్రషర్ల అక్ర మాలపై దృష్టి సారించి పూర్తి నివేదికను రూపొందిస్తుందని తెలుస్తుంది. చాలా క్రషర్ యాజమాన్యాలు డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎటువంటి బిల్లులు లేకుండానే అమ్మకాలు సాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దానికి తోడు గుట్టలను పేల్చడానికి విరివిగా పేలుళ్లకు సంబంధించిన వస్తువులను వాడుతున్నట్లు గమనించారు. ఈ నేపథ్యంలో లకుడారం ప్రాంతంలో క్రషర్లపై నిఘా పెట్టిన అధికారులు ఎటువంటి బిల్లులు లేకుండా, ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా అక్రమంగా తరలిస్తున్న స్టోన్ మెటీరియల్ ను అధికారులు పట్టుకున్నారు. ప్రముఖ రాజకీయ నేతకు చెందిన ఓ క్రషర్ నుంచి ఈ రోబో సాండ్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా యాజమాన్యాలు బిల్లులు లేకుండా పెద్ద మొత్తంలో సరుకును తరలిస్తూ అధికారులకు పాత వే బిల్లులు చూపి తప్పించుకుంటున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. అక్రమాలకు పాల్పడుతూ ప్రజలకు ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించే క్రషర్ యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..
గుట్టలను పేల్చడానికి వినియోగించే పేలుడు పదార్థాలను భారీగా పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రషర్ల అక్రమాలపై విచారణ జరుపుతూ క్రషర్లపై నిఘా పెట్టిన పోలీసులు పీఎంఆర్ క్వారీలో అక్రమంగా దాచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలలో 800 జిలీటన్ స్టిక్స్, 35 డిటోనేటర్లు, 180 ఐడియన్ బూస్టర్లు, 1375 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 375 డి టానేటరింగ్ వంటి ప్రమాదకరమైన నిషేధిత పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్వారీలో బీఅర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి సైతం భాగస్వామిగా ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేసి వినియోగిస్తున్నందుకు పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఇందులో ప్లాంట్ ఇంచార్జి రాధాకృష్ణ, బ్లాస్టర్ లింగస్వామి, సూపర్ వైజర్ సుబ్బారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా క్వారీ నిర్వాహకులైన ఉమాదేవి, ప్రీతం రావు, రమేష్, ఆదర్శ్ రెడ్డిలు పరారీలో ఉన్నట్లు పటాన్ చెరు ఏస్ఎచ్ఓ లాలూ నాయక్ వెల్లడించారు. పరారీలో ఉన్న క్వారీ యజమానులను త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ ఆక్రమాలపై పూర్తి దృష్టి సారించిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో లాగా ఇష్టారీతిగా నిబంధనల ఉల్లంఘన కుదరదని కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం గట్టి హెచ్చరికలు పంపినట్లయింది. క్రషర్లపై నయా సర్కారు నిఘా అధికం చేయడంతో గతంలో ఇబ్బందిగా అక్రమాలకు పాల్పడ్డ క్రషర్ యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. (దిశ న్యూస్)
క్రషర్లకు అక్రమ మార్గంలో అనుమతులు ఇచ్చిన అవినీతి అధికారుల పనిపట్టాలని కూడా స్థానికులు చెపుతున్నారు. పటాన్ చెరువులో ఇష్టరీతిన కాలుష్యం చేస్తున్న బల్క్ డ్రగ్ పరిశ్రమలపై కూడా ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టి వాటి ఆగడాలను కూడా అరికట్టాలని అంతేకాక అడ్డగోలు అవినీతికి పాల్పడుతూ ప్రజల ఫిర్యాదులను పట్టించుకొని అవినీతి తిమింగలాలను పట్టి శిక్షించాలని అవసరమైతే విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ మరియు ఏసీబీ అధికారులచే విచారణ జరిపించి సంగారెడ్డి పరిధిలోని అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలని సామాజిక వేత్తలు, పొల్యూషన్ బాధితులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. సంగారెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అవినీతి తిమింగలలుగా మరి సామాన్యుల బాధలను పట్టించుకోవడం లేదని మేం చేసిన ఫిర్యాదులను సైతం వారి అక్రమ వసూళ్లకు వాడుకుంటూ లంచాలు తీసుకోవడమే పనిగా పెట్టుకోని కొన్ని పొల్యూషన్ పరిశ్రమలకు సేవకులుగా మారి వారి విధులు మర్చిపోతున్నారు. అలాంటి వారిపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఏసీబీ అధికారులతో విచారణ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే ప్రభుత్వ పెద్దలను కలిసి వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి అందరం సిద్దంగా ఉన్నామని తెలిపారు.
