- ఏసీబీ ట్రాప్.. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్
- రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కిష్టయ్య
- మెస్ బిల్లుల చెల్లింపుల్లో చేతివాటం
- గతంలోనూ రూ.50వేలు తీసుకున్నట్లు సమాచారం
- అసలు సూత్రధారి ఎవరు..?
కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంగసారపు కిష్టయ్య ఏసీబీకి చిక్కాడు. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కేయూలో 2021-22, 23 సంవత్సరానికి హాస్టళ్లలో పాలు, పెరుగు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ పెండెం రాజేందర్ టెండర్ దక్కించుకున్నాడు. మే, ఏప్రిల్‌కు సంబంధించిన రూ.9 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఇచ్చేందుకు అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ కిష్టయ్య రాజేందర్‌ను లంచం డిమాండ్ చేశాడు. రాజేందర్ సమాచారంతో కిష్టయ్యను ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా పాల కాంట్రాక్టర్ రాజేందర్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా రూ.50 వేలు లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. దీని వెనుక ఉన్నవారిపై ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఒక్క హాస్టల్లోనే కాకుండా కిష్టయ్యపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీలో కీలకమైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ఒకడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా వీసీ నియమించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కిష్టయ్య భార్య ఆర్ట్స్ కాలేజీలో పార్ట్‌టైం సోషియాలజీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుండడం విశేషం.
షాడో ఎవరు?
అయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య డబ్బులు డిమాండ్ చేయడం వెనుక వీసీ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్ట్ కాలేజీలో పని చేస్తున్న కిష్టయ్యను వీసీ క్యాంపస్ కు బదిలీ చేయడమే ఇందుకు నిదర్శనం. కాగా విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో గతంలో రూ.3 కోట్ల కుంభకోణం జరిగింది. కిష్టయ్యతోపాటు ప్రిన్సిపాల్ బన్న అయిలయ్యపై విచారణ కమిటీ ఉండగానే కిష్టయ్యను క్యాంపస్ కు మార్చారు. న్యాక్ కోసం కేటాయించిన రూ.10 కోట్ల బిల్లల్లో కమీషన్ల కోసం ఆయనను బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. యూనివ ర్సిటీలోని కీలకమైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్యనే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతు న్నారు. న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర పనుల కోసం రూ.10 కోట్ల కేటా యించారు. వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్లతో పాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్‌కు కిష్టయ్యనే అసిస్టెంట్ రిజిస్ట్రార్ నియమించారు.
బిల్లులో 10 శాతం ఇవ్వాలన్నాడు – పెండం రాజేందర్, కాంట్రాక్టర్
కేయూలో మూడేళ్లుగా నాలుగు హాస్టళ్లలో పాలు, పెరుగు సరఫరా చేస్తున్నా. గత సంవత్సరం ఏప్రిల్, మే బిల్లులు ఇవ్వకుండా అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ కిష్టయ్య నిలిపివేశాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా పిలిపించి అడిగితే చెల్లిస్తానన్నాడు. మళ్లీ ఇప్పుడు బిల్లులు ఎందుకివ్వాలి.. మాకు కూడా ఖర్చులు ఉంటాయి. అందరూ ఇస్తున్నారు. నువ్వు కూడా రూ.50 వేలు ఇస్తేనే రూ.3 లక్షల బిల్లులు ఇస్తానడంతో ఏసీబీ అధికారులకు పట్టించా.