కొండల్ని పేల్చి.. కాలుష్యం పెంచి

• నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ల నిర్వహణ
• బూడిదమయంగా పొలాలు
• నివాసాలను ముంచెత్తుతున్న దుమ్ము

అనుమతులుండవు.. నిబంధనలు పట్టవు. ఇష్టారాజ్యంగా కొండలను పిండిచేస్తూ పరిసరాలను కాలుష్యం చేస్తున్నారు. స్థానికుల ఆందోళనలు, ఫిర్యాదులతో కాలుష్య నియంత్రణ మండలి కొన్నింటిని మూసివేయాలని ఆదేశాలిచ్చినా బేఖాతరు చేస్తున్నారు. విద్యుత్తు సరఫరా తొలగించినా జనరేటర్లతో దందా కొనసాగిస్తున్నారు. నిత్యం అర్ధరాత్రి టిప్పర్ల రాకపోకలతో శబ్ద కాలుష్యంతోపాటు.. దుమ్ముతో పొలాలు, నివాసాలు బూడిదమయంగా మారుతున్నాయి. ఇదీ గ్రేటర్ పరిధిలోని కంకర మిల్లుల పరిస్థితి.

రంగారెడ్డి జిల్లాలోని బండరావిరాల, చిన్నరావిరాల, సద్దుపల్లి, మామిడిపల్లి, కుంట్లూరు, ఇబ్రహీంపట్నం, కోకాపేట, గండిపేట, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్టోన్ క్రషింగ్ జరుగుతోంది. కంకర, హాట్ మిక్స్ ప్లాంట్లకు అనుమతులు.. నిర్వహణను గనులు, విద్యుత్తు, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖలు పర్యవేక్షిస్తుంటాయి. మామిడిపల్లిలోని హార్డ్ వేర్ పార్కు సమీపంలోని కంకర మిల్లులకు అనుమతులున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు తీసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. నిబంధనల పాటింపు విషయంలో పీసీబీ (PCB) నిర్లక్ష్యం వైఖరి కనిపిస్తోంది. అక్కడ రేగే దుమ్ము. దూళి, రాతిపొడి పొలాలు, జలవనరులు, ఆవాసాలపై పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

• రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లోని కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న స్టోన్ క్రషింగ్ యూనిట్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రషింగ్ చేసేటప్పుడు వెలువడే దుమ్మును నిలువరించేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలను నిర్వాహకులు గాలికొదిలేశారు. రాతిపొడి పేరుకుపోవడంతో వాహనాల రాకపోకల సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని స్థాయిలో దుమ్ము లేస్తోంది.

• గండిపేట పరిసరాల్లో క్వారీ, క్రషింగ్ కార్యకలాపాలపై నిషేదం ఉంది. అయినా గండిపేట, వట్టినాగుల పల్లి, కోకాపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్టోన్ క్రషింగ్ జరుగుతోంది. పీసీబీ నివేదికల ప్రకారం ఈ ప్రాంతాల్లోనే అత్యధికంగా అతి ప్రమాదకరమైన సూక్ష్మ దూళి కణాల స్థాయి పెరుగుతోంది.

సీపీసీబీ (CPCB) నిబంధనలు..
దుమ్ము లేవకుండా యూనిట్ చుట్టూ షెడ్డు ఏర్పాటు చేయడంతోపాటు స్ప్రింక్లర్లతో నీటిని చిమ్మాలి. వాహనాల్లో తరలించేటప్పుడు మూడు వైపులా, పై భాగంలో పట్టాలు కప్పాలి. అప్రోచోడ్లు, ఇన్ లైట్, అవుట్ లెట్ల వద్ద స్ప్రింక్లర్లు సమకూర్చాలి. ఉద్గారాల నియంత్రణకు డ్రై ఎక్స్ ట్రాక్షన్ తో పాటు బ్యాగ్ ఫిల్టర్ ఏర్పాటు చేయాలి. కన్వేయర్ల నుంచి స్క్రీన్ హౌస్ వరకు దుమ్ము రేగకుండా కవర్లను అడ్డుగా ఉంచాలి. యూనిట్ ప్రాంగణంలో యాంటీ. స్మోగ్ గన్ ఏర్పాటు చేయాలి.(సోర్స్: ఈనాడు)

క్రషర్ల యాజమాన్యాల బాగోతం.. క్రషర్ల వెనకాల జరుగుతున్న అవినీతి, అక్రమాలు.. క్రషర్ల అడ్డగోలు తవ్వకాలు, నిబంధనల విస్మరణ.. క్రషర్లకు అక్రమ మార్గంలో అనుమతులు ఇచ్చిన అవినీతి అధికారుల బాగోతం.. CFO, CFE లేకుండా నడుస్తున్న పరిశ్రమల చిట్టా.. కావాలనే CFO, CFE రిజెక్ట్ చేయడం.. పెండింగ్ లో పెట్టడం.. పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలకు కొమ్ముకాస్తూ వాటి ద్వారా అడ్డగోలు లంచాలు వసూలు చేస్తూ.. పై అధికారులంటే భయం లేని.. విజిలెన్స్ & ACB అధికారులు కూడా మమ్మల్ని ఏం చేయలేరు అని విర్రవీగుతున్న కొంత మంది అవినీతి అధికారుల బాగోతాలపై పేర్లతో సహా త్వరలో పూర్తి ఆధారాలతో మరింత సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం.. అవినీతిపైనే మా పోరాటం..