MPL స్టీల్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా

  • పరిశ్రమ ఎదుట గ్రామ యువకులు, అఖిలపక్షం, పర్యావరణ వేత్తల ఆందోళన
  • కాలుష్య పూరిత పరిశ్రమలు మాకొద్దు

చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని MPL స్టీల్ పరిశ్రమ విస్తరణకు శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నల్లగొండ జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ పి. సురేష్ బాబు గురువారం తెలిపారు. తదుపరి అభిప్రాయ సేకరణ తేదీని ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడటంతో స్థానిక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని వెదజల్లే ఇలాంటి పరిశ్రమలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, పర్యావరణ వేత్తలు కోరారు.

కాలుష్య పూరిత పరిశ్రమలు మాకొద్దు
చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 295, 299, 300లలో సుమారు 32 ఎకరాలలో ఉన్న ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ విస్తరణను నిలిపివేయాలని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గత 20 రోజులుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఉన్న పరిశ్రమలతోనే ఇక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే కొత్తగా పరిశ్రమల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే అతి కొద్ది కాలంలోనే ఈ ప్రాంతమంతా ఎడారి కాక తప్పదని వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. వెలిమినేడు చుట్టూ ప్రక్కల గ్రామల ప్రజలు కంపెనీ మాకొద్దని, కంపెనీ వల్ల వచ్చే కాలుష్యం తో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు సంభవిస్తున్నట్లు ఆరోపిస్తూ కంపెనీ ముందు నిరసనకు దిగారు. కంపెనీ మాకొద్దంటూ నినాదాలు చేయడమే కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ కోసం వేసిన టెంట్లను కూల్చివేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పొలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళనకారులపై లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐ మహేశ్, ఎస్సై రవిల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపు చేశారు. . కంపెనీ విస్తరణపై మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకే కంపెనీ విస్తరణ ఉంటుందని వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగదని చెప్పడంతో ప్రజలు శాంతించారు.