- వివిధ శాఖల్లో ఉన్నోళ్ల లిస్ట్ సీఎస్ కు పంపిన జీఏడీ
- కీలక స్థానాల్లో ఐదుగురు రిటైర్డ్ ఐఏఎస్ లు
- మున్సిపల్ 179, ఎడ్యుకేషన్లో 88, ఆర్అండ్ బీలో 81, సివిల్ సప్లైస్లో 75, ఇరిగేషన్ లో 70 మంది
- లక్షల్లో జీతాలు, అలవెన్స్ లిచ్చిన గత సర్కార్
- అందర్నీ తొలగించేందుకు రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలింది. అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1,049 మంది ఉన్నట్లు జీఏడీ లిస్ట్ ను సీఎస్ కు పంపింది. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనకు అందజేయనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. త్వరలో వీరి తొలగింపుపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. కాగా అత్యధికంగా మున్సిపల్ డిపార్ట్ మెంట్లో 179 మంది, ఎడ్యుకేషన్ లో 88 మంది, సివిల్ సప్లైస్ లో 75 మంది, ఆర్అండ్ బీలో 70 మంది, పంచాయతీరాజ్ లో 48 మంది ఉన్నట్లు సమాచారం.
వీరంతా రిటైర్ అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు టర్మ్ లలో కన్సలెంట్లుగా, సలహాదారులుగా, ఈఎన్సీలుగా కొనసాగారు. గత ప్రభుత్వంలో పెద్దల కులానికి చెందిన, అనుకూలంగా ఉన్న ఆఫీసర్లు చాలా ఏండ్ల కిందనే రిటైర్ అయినప్పటికీ వారిని తీసుకొచ్చి ఉన్నత పోస్టుల్లో కూర్చోబెట్టింది. వీరిలో చాలా మంది టర్మ్ ఎప్పటి వరకు అనేది స్పష్టం చేయకుండా అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఉత్తర్వులు ఇచ్చారు. లక్షల్లో జీతాలు చెల్లించడంతో పాటు వెహికల్, ఆఫీసు, అదనపు సిబ్బంది ఇలా అన్ని సౌలత్ లు కేటాయించడంతో సర్కారుపై కోట్ల రూపాలయ భారం పడింది.
కీలక పోస్టుల్లో ఐదుగురు రిటైర్డ్ ఐఏఎస్ లు
అధికారుల్లో ఐదుగురు రిటైర్డ్ ఐఏఎస్ లు ఉండటం గమనార్హం. సెక్రటేరియెట్ లో ప్రోటోకాల్ డిపార్ట్ మెంట్ లో విధులు నిర్వర్తిస్తున్న అర్విందర్ సింగ్, ఎండో మెంట్ కమీషనర్ అనీల్ కుమార్, పశుసంవర్ధక శాఖలో స్పెషల్ సీఎస్ గా అధర్ సిన్హా, లేబర్ డిపార్ట్ మెంట్ లో స్పెషల్ సీఎస్ గా రాణికుముదిని, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో ఉమర్ జలీల్ ఉన్నారు. వీరిని కూడా ప్రభుత్వం రిలీవ్ చేయనుందని సమాచారం.