‘హరితహారం’లో 20 కోట్ల మొక్కలు నాటుతాం : పీసీసీఎఫ్‌ సువర్ణ

హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని పీసీసీఎఫ్‌ సి.సువర్ణ అన్నారు. గురువారం ఆమె సీసీఎఫ్‌ భీమానాయక్‌తో కలిసి సత్తుపల్లి అర్భన్‌ పార్కును సందర్శించారు. అనంతరం పార్కులో వాకింగ్‌ ట్రాక్‌, వాచ్‌టవర్‌ ప్రాంతాలను పరిశీలించారు. అడవి జంతువుల దాహం తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్‌ పిట్స్‌ నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం అటవీశాఖ ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌తోపాటు అటవీ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. తర్వాత కిష్టారం అటవీశాఖ నర్సరీ, పెనుబల్లి మండలం భువన్నపాలెం వాచ్‌టవర్‌ను పరిశీలించారు. వారి వెంట జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌, ఎఫ్‌డీవో మంజుల, ఎఫ్‌ఆర్వోలు, సిబ్బంది ఉన్నారు.