అవును.. అవినీతి కంపు !

  • ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ సంచలన ట్వీట్
  • అన్ని శాఖల్లోనూ అవినీతి ఉందంటూ నెటిజన్ల కామెంట్

తెలంగాణలో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ఆయన స్పందించిన తీరుపై నెటిజన్లతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. మొన్నటి వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొనసాగిన సీవీ ఆనంద్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల జడ్చర్ల ఎక్సెజ్ సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఓ నెటిజన్ ‘ఏసీబీ రాకింగ్’ అంటూ ట్విట్టర్ లో సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన ఆయన ఎక్సెజ్ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్, రవాణాశాఖల్లో అత్యంత అవినీతి ఉందని రిప్లై ఇచ్చారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. రాష్ట్రంలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖలోనూ అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని.. సీవీ ఆనంద్ పేర్కొనటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీవీ ఆనంద్ లాంటి ఐపీఎస్ అధికారి బహిరంగంగా ప్రభుత్వ శాఖలపై ఇలాంటి కామెంట్ చేయటం మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. అందులోనూ.. ఆయన పని చేసిన పోలీస్ శాఖ కూడా ఉందని పేర్కొనటం గమనార్హం. ప్రభుత్వంలో భాగంగా ఉంటూ ఒక సామాన్య నెటిజన్ ల స్పందింటంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరోవైపు సీవీ ఆనంద్ ట్వీట్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మిగతా శాఖల్లోనూ అవినీతి కంపుకొడుతోందని కామెంట్స్ చేస్తున్నారు. లంచం ఆరోపణలపై సస్సెండ్ అయిన ఓ అధికారి తిరిగి డిపార్ట్ మెంట్ లో చేరారని ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు.. రాజకీయ, ఇతర ఒత్తిళ్ల కారణంగా కొన్నిసార్లు ఇటువంటివి జరుగుతాయని ఆనంద్ బదులిచ్చారు. మరో నెటిజన్ కొండాపూర్ ఆర్టీఏ అవినీతితో నిండిపోయిందని దానిపై ఓ లుక్కేయాలని కోరారు. బ్రోకర్ల ద్వారా వస్తున్న వారికే లైసెన్స్ లు, రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని కామెంట్ చేయగా ఆనంద్ ‘అవును’ అని బదులు ఇచ్చారు. మరో నెటిజన్ ఆయిన సామాజిక పర్యావరణ వేత్త పర్యావరణాన్ని కాపాడాల్సిన PCB లో కూడా అవినీతి అధికారులు ఎక్కువ అయ్యారని PCB పై కూడా దృష్టి పెట్టాలని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ను ట్విట్టర్ లో కోరారు. దీంతో సీవీ ఆనంద్ ట్వీట్స్ వైరల్ గా మారాయి.