అక్రమాస్తుల్లో శివ బాలకృష్ణకు నలుగురు బినామీలు..?

• మిత్రుడు, దళారుల సహకారంతో వసూళ్లు
• దర్యాప్తులో వెలుగుచూస్తున్నకొత్త కోణాలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణ బినామీలపై ఆ శాఖ దృష్టి సారించింది. హెచ్ఎండీఏ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన 6 నెలల కింద రెరాకు బదిలీ అయ్యారు. భూ మార్పులు, పంచాయితీల పరిష్కారంలో అధికారాన్ని ఉపయోగించుకొని అడ్డగోలు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్కా ఆధారాలతో అవినీతి నిరోధకశాఖ అధికారులు(ACB) పుప్పాలగూడలోని సెక్రటేరియట్ కాలనీలోని ఆయన నివాసంలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు సోదాలు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బినామీల పేరిట భారీగా ఆస్తులున్నట్లు అంచనాకు వచ్చి ఆదిశగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. దర్యాప్తులో కొత్తకోణాలు వెలుగు చూసినట్లు విశ్వసనీయ సమాచారం. డ్రైవర్ పేరిట శివారుల్లో రూ.20 కోట్లకు పైగా భూములు కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలిసింది.

సొమ్ములు పడ్డాకే సంతకాలు
హెచ్ఎండీఏ డైరెక్టర్ గా ఉన్నపుడే కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. నగరానికి చెందిన దళారి ఇతడి కుడిభుజం. ఏ పైలు మీద సంతకం పెట్టాలన్నా, ఎటువంటి పరి ష్కారం చూపాలన్నా సదరు దళారి ఊ.. అంటేనే దస్త్రం కదిలేది. శివారు ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి (మిత్రుడు) బాలకృష్ణకు ప్రధాన బినామీ. నిత్యం కార్యాలయంలోనే మిత్రుడితో చర్చలు జరిపేవారు. హెచ్ఎండీఏ పరిధిలో ఏ పని జరగాలన్నా వీరిద్దరిని కలిశాకే అధికారుల వద్దకెళ్లాలి ఎన్నికల నియమావళి వస్తుందని తెలియగానే నగర శివారు, పొరుగు జిల్లాలకు సంబంధించిన పైళ్లపై ఆగమేఘాల మీద సంతకాలు చేసి భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు కార్యాలయంలో ఓ ఉద్యోగి నమ్మినబంటు. నలుగురు నడిపిన అవినీతి భాగోతంపై ఏసీబీ అధికారులు కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం.

ఆయన వద్దనే కీలక ఫైళ్లు
హెచ్ఎండీఏ నుంచి రెరాకు బదిలీ అయ్యేటప్పుడు ప్రధాన ఫైళ్లన్నీ ఆయన వెంట తీసుకెళ్లిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వాటిని తన వద్ద ఉంచుకొని బేరసారాలు సాగించినట్లు సమాచారం.. కొద్ది సమయంలోనే సుమారు 500 దస్త్రాలపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సమర్పించాల్సిన కీలక దస్త్రాలు తన వద్దే ఉంచుకున్నట్లు ఉద్యోగులు ఏసీబీ బృందానికి వివరాలు అందజేసినట్లు సమాచారం. బినామీల్లో మరొకరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నట్లు తేలటంతో వివరాలు సేకరిస్తున్నారు. అనుమానం రాకుండా సంబంధంలేని వ్యక్తులను బినామీలుగా మార్చుకొని ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ భావిస్తోంది. పలు జిల్లాల రిజిస్ట్రార్ కార్యాలయాలు, కార్యాలయ ఉద్యోగులు, బ్యాంకు లాకర్ల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. అక్కడ లభించే ఆనవాళ్ల ద్వారా ఈ కేసుతో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిశా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.