- కలుషితమవుతున్న భూగర్భ జలాలు
- వ్యర్థ జలాలతో బీడువారుతున్న పొలాలు, ఆందోళనలో రైతులు
- కూప్పానగర్ లో శ్రీత కెమికల్ పరిశ్రమ తొలగించాలని డిమాండ్
- పట్టించుకోని పిసిబి అధికారులు
- ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతులు, స్థానిక ప్రజలు
వ్యవసాయానికి పనికిరాని బీడు భూముల్లో ఏర్పాటు చేయాల్సిన కాలుష్యకారక కంపెనీలను పంటలు పండించే వ్యవసాయ పొలాల మధ్యన ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా పంట పొలాలు దెబ్బతినడంతో పాటు బావులు, బోరు బావులు, ఊట చెరువులలో నీరు కలుషితమవుతోంది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కూప్పానగర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన శ్రీత కెమికల్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాలు విలవిలలాడుతున్నాయి.
ప్రమాదకర రసాయనిక ధూళి, వాయుకాలుష్యం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కలుషితనీరు తప్ప తాగేందుకు గుక్కెడు మంచి నీరు దొరకడం లేదు. స్థానికులు పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా కంపెనీ యజమానులు కాని, సంబంధిత పొల్యూషన్ కట్రోల్ బోర్డు అధికారులు కాని స్పందించిన దాఖలాలు లేవు. దీంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్దమవుతున్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కూప్పానగర్ గ్రామ శివారులో శ్రీత కెమికల్ పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిలలాడుతున్నారు. కుప్పానగర్ పంచాయతీలో సుమారు 3 వేల మంది జనాభా నివసిస్తున్నారు. శివారు ప్రాంతంలో నెలకొల్పబడిన కెమికల్ పరిశ్రమకు కేవలం 1 కిలో మీటర్ దూరంలోనే ఈ గ్రామం ఉంది. అటు ఝరాసంగం గ్రామానికి 1 కిలో మీటర్ దూరంలో ఉంది. ఈ గ్రామంలో 4 వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు అధిక శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కెమికల్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న ప్రమాదకర రసాయానిక దూళి, వాయుకాలుష్యం గ్రామాన్ని చుట్టుముడుతూ స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో మృత్యువుకు దగ్గరవుతున్నారు. వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం అధికమై గ్రామంలో పరిశ్రమ చుట్టు పక్కల ఎక్కడ బోరు వేసినా ఉప్పునీరు, కలుషితనీరు తప్ప తాగేందుకు గుక్కెడు మంచినీరు దొరకడం లేదు. చెరువు కాలువల్లో సాగునీరు సైతం కలుషితం అవుతున్నది. కలుషిత నీటితో పంటలు సక్రమంగా పండటం లేదని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితిలో తమ జీవన మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని స్థానికులు గతంలో పలు దఫాలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా కంపెనీల యాజమాన్యాలు కానీ, PCB అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. కంపెనీ పక్కన ఉన్న చెరువులో నీరు అంతా కలుషితమైంది. అంతే కాకుండా రోడ్డుపై వెళుతున్న వాహనదారులు సైతం పరిశ్రమ వదులుతున్న వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంపెనీ పెద్దల నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు భారీగా లంచాలు తీసుకొని పట్టించుకోకపోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దం అని చెబుతున్నారు. ఇప్పటికైనా పిసిబి అధికారులు స్పందించి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
వ్యర్థ జలాలను భూమిలోకి…
కంపెనీలో పేరుకుపోయిన వ్యర్థ జలాలను అదే ఆవరణలో గతంలో వేసిన బోరుబావులలోకి వదులుతున్నట్లు సమాచారం. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న బోరు బావులు, బావులు, చెరువులలో ఉన్న నీరు మొత్తం కలుషితమవుతుంది. దీంతో రైతులు పండించే పంటపొలాలు సైతం దెబ్బతింటున్నాయి.
ఈ పరిశ్రమ చేస్తున్న కాలుష్యంపై పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా స్థానిక PCB అధికారులపై ఉన్నతస్థాయి అధికారులు, సంబంధిత శాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి మరియు విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్, ACB అధికారులకు కూడా వీరి అవినీతిపై ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
సంగారెడ్డి పిసిబి ఆర్ఒ కార్యాలయం పరిధిలో జరుగుతున్నా అవినీతి అధికారుల బాగోతాలపై కండ్లు బైర్లు కమ్మే నిజాలను పూర్తి ఆధారాలతో “రాబోయే కథనంలో” మీ ముందుకు తీసుకు వస్తుంది.. మీ ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం.. అవినీతిపైనే మా పోరాటం..