ఏసీబీకి చిక్కిన ఎస్సై సురేశ్‌

కేసు నుంచి తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీకి చిక్కాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం పగిడ్యాల్‌కు చెందిన కృష్ణారెడ్డి కుమారుడిపై ప్రేమ వ్యవహారంలో బాధితురాలు మహ్మదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నుంచి బయటపడేసేందుకు ఎస్సై సురేశ్‌ బాధితుల నుంచి రూ.50 వేలు డిమాండ్‌ చేశాడు. బాధితులు రూ.30 వేలు చెల్లించారు. మిగతా డబ్బుల కోసం బెదిరించగా.. ఏసీబీని ఆశ్రయించారు.
ప్లాన్‌ ప్రకారం.. ఆదివారం సాయంత్రం బాధితులు రూ.20 వేలు ఇస్తామని ఎస్సైకి ఫోన్‌చేయగా తన కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇస్మాయిల్‌కు ఇవ్వాలని సూచించాడు. ఆయన్ను సంప్రదిస్తే జిరాక్స్‌ సెంటర్‌ యజయాని మూసకు ఇవ్వాలని చెప్పాడు. బాధితులు ఇచ్చిన డబ్బులను జిరాక్స్‌ సెంటర్‌ యజమాని ఎస్సైకి ఇచ్చేందుకు వెళ్లగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎస్సైపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.