◆ అన్న దోచాడు.. తమ్ముడు దాచాడు..
◆ శివబాలకృష్ణ బంధుమిత్రులే బినామీలు
◆ 214 ఎకరాల భూములు, 29 ప్లాట్లు, 7 భవంతులు, 3 విలాసవంతమైన విల్లాలు
◆ తెలంగాణ, వైజాగ్లో ఉన్నట్టు గుర్తింపు
◆ మరికొందరు అధికారుల పాత్రపైనా విచారణ
◆ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా ఇన్ ఛార్జ్ సెక్రటరీ శివ బాలకృష్ణకు సంబంధించి రూ.1,000 కోట్లకుపైనే అక్రమ ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. తెలంగాణతో పాటు విశాఖపట్టణంలో అతనికి ఆస్తులు ఉన్నట్టు వెల్లడైందన్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన బాలకృష్ణను ప్రత్యేక కోర్టు అనుమతితో 8 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు అతన్ని నిశితంగా విచారించారు. ఇందులో అతని కుటుంబ సభ్యులు, బినామీల పేర 214 ఎకరాల భూములు, 29 ప్లాట్లు ఉన్నట్టుగా గుర్తించినట్టు సుదీంద్ర తెలిపారు. తెలంగాణ, వైజాగ్ లో 19 ఓపెన్ ప్లాట్లు, 7 భవంతులు, 3 విలాసవంతమైన విల్లాలు ఉన్నట్టుగా తేలిందన్నారు. బ్యాంకు లాకర్లలో భారీగా బంగారం, పత్రాలు బయటపడ్డాయన్నారు.
మరికొందరి పాత్రపై విచారణ…
శివ బాలకృష్ణ అక్రమాల్లో మరికొందరు అధికారుల పాత్ర ఉన్నట్టుగా దర్యాప్తులో వెల్లడైందని సుధీంద్ర తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించామని, మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముగ్గురు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా శివ బాలకృష్ణ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులపైనా విచారిస్తున్నామన్నారు.
శివ బాలకృష్ణ కస్టడీ బుధవారంతో ముగిసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. దానికి ముందు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.