పరిశ్రమలు నిబంధనలు పాటించకపోతే చర్యలు : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

  • పాశమైలారంలో అగ్ని ప్రమాద ఘటనపై విచారణ
  • మూడు పరిశ్రమలు సీజ్
  • పీసీబీ, ఫ్యాక్టరీస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం

పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని, ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పాశమైలారంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ రూపేష్, పీసీబీ అధికారులు, ఫైర్ సేఫ్టీ, పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తనిఖీలు నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలు సరైన నిబంధనలు పాటించకపోవడంతో పాటు యంత్రాలను సరైన రీతిలో శుభ్రపరచకపోవడం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతోనే అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని. రెడ్ కేటగిరీలో ఉన్న కొన్ని పరిశ్రమలు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని తమ దర్యాప్తులో తేలిందన్నారు. పరిశ్రమలపై నిరంతరం నిఘా పెట్టేలా పిసిబి, ఫైర్ సేఫ్టీ, కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. అనంతరం ఐలా కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పీసీబీ, ఫ్యాక్టరీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఎందుకు మానిటరింగ్ చేయడం లేదంటూ మండిపడ్డారు. చెరువులోకి రసాయనాలను విడుదల చేస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగి.. మరుసటి రోజున మృతదేహం లభిస్తే అప్పటివరకు ఏం చేస్తున్నారంటూ లేబర్ ఆఫీసర్ పై ఆగ్రహించారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని, వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులను సైతం ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. ఇక నుంచి ప్రత్యేకంగా తాను పరిశ్రమలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తానని తెలిపారు.

మూడు పరిశ్రమలు సీజ్
పాశమైలారం పారిశ్రామిక వాడలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా, అగ్నిమాపక పరికరాలు అ మర్చని మూడు పరిశ్రమలను గుర్తించారు. సాలుబ్రీయాస్ కంపెనీ, విటల్ సింథటిక్ కంపెనీ, వెంకరూ కెమికల్స్ కంపెనీలను సీజ్ చేశారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు