ఏసీబీకి చిక్కనివారు ‘వైట్ పేపర్’ అని కాదు.. ఇంకా టైమ్ రాలేదేమో..!

• డీఐజీ సుమతి ఆసక్తికర ట్వీట్

ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘నిఘా’ ఎప్పటికీ ఉంటుంది.. చిక్కినవారిపై చట్టం తన పని చేసుకుపోతుంది. చిక్కనివారు ‘వైట్ పేపర్’ అని కాదు. వారికి ఇంకా టైమ్ రాలేదేమో’ అని పేర్కొన్నారు. డీఐజీ ట్వీట్ తాజాగా అధికారవర్గాల్లో చర్చగా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ పట్టుబడుతున్నవారు చిన్నాచితక అధికారులేనని, పెద్ద తలకాయలు చాలామంది ప్రజలను పట్టి పీడిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జగజ్యోతికి 14 రోజుల రిమాండ్
• ఏసీబీ అధికారులు ఆమెను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు..
• ఆమె బినామీలపై కూడా నజర్ పెట్టె అవకాశం

నిజామాబాద్ జిల్లాలోని అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు గాజుల రామారంలోని బాలల సంరక్షణ గృహనిర్మాణ పనులు అప్పగించేందుకు కాంట్రాక్టర్ బోడుకం గంగాధర్ వద్ద ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి డబ్బులు డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై అధికారులు స్పందించారు. పథకం ప్రకారమే సోమవారం రోజున కార్యాలయానికి వెళ్లిన గంగాధర్ రూ.84 వేలు లంచం ఇచ్చాడు. ఆ సమయంలోనే అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జగజ్యోతికి ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. లంచం తీసుకుంటూ ఓ అధికారి చిక్కిన కేసులో ఇంత పెద్దమొత్తంలో ఆస్తులు పట్టుబడడం కలకలం రేపుతోంది. ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మార్చి 6 వరకూ ఆమెకు రిమాండ్ విధిస్తూ చంచల్ గూడ మహిళా జైలుకు తరలించాలని ఆదేశాలిచ్చింది. మరోవైపు, జగజ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని, రిమాండ్ ఆపాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కోర్టు అనుమతి తీసుకున్నామని ఏసీబీ న్యాయమూర్తి తెలుపగా జగజ్యోతికి రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ఆమె ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అదే రోజు రాత్రి ఆమె తనకు అస్వస్థతగా ఉందని ఏసీబీ అధికారులకు తెలుపగా వారు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆరోగ్యంగానే ఉన్నారని నిర్ధారిస్తూ బుధవారం డిశ్చార్జి చేశారు. అనంతరం ఆమెను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన జగజ్యోతి నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.65.50 లక్షల నగదు, 3.6 కిలోల బంగారు నగలు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

జగజ్యోతి బినామీలపై ఏసీబీ నజర్.. కస్టడీ కోరుతూ పిటిషన్ వేసే ఛాన్స్..
ప్రస్తుతం ఏసీబీ అధికారులు జగజ్యోతి ఇంట్లో లభించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. సోదాల సమయంలో ఆమె ఇంట్లో డబ్బు, నగలతో పాటు భారీగా డాక్యుమెంట్లు దొరికాయి. ఇప్పుడా డాక్యుమెంట్ల విలువను అంచనా వేస్తున్నారు. అందుకోసం ఆయా రిజిస్టర్ ఆఫీసులను సంప్రదిస్తున్నారు. అక్కడే లభించే సమాచారంతోనే ఆమె ఆస్థుల మొత్తం విలువ తెలుస్తుంది. జగజ్యోతికి ఎవరైనా బినామీలు కూడా ఉన్నారా అన్న కోణంలోనూ ఏసీబీ విచారణ జరుపుతోంది. ఆమె ఆస్తుల పూర్తి వివరాలు తెలిసిన తరువాత ఏసీబీ అధికారులు ఆమె కస్టడీ కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉంది.