- 179 పరిశ్రమలకు హెచ్చరికలు
- గతేడాది తీసుకున్న చర్యలపై తాజాగా పీసీబీ నివేదిక
పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నష్టం కలిగిస్తున్న.. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమలపై భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. గతేడాది రాష్ట్రంలో 87 పరిశ్రమల మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట గడువులోగా లోపాల్ని సవరించుకోవాలంటూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న మరో 179 పరిశ్రమలను హెచ్చరించింది. ఈమేరకు గతేడాది కాలుష్యకారక పరిశ్రమలపై తీసుకున్న చర్యల వివరాలపై తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకి పీసీబీ ఇటీవల నివేదిక సమర్పించింది. ఫిర్యాదులు వచ్చిన పరిశ్రమలపై పీసీబీలోని టాస్క్ ఫోర్స్ కమిటీ విచారిస్తుంది. కాలుష్య తీవ్రత ఆధారంగా పీసీబీ చర్యలు తీసుకుంటుంది. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే వాయు, నీటి కాలుష్యానికి పాల్పడే పరిశ్రమలు అనేక రెట్లు అధికంగా ఉంటాయి.
‘రెడ్’ కేటగిరీ పరిశ్రమలపై అధిక ఫిర్యాదులు
పీసీబీకి వచ్చే ఫిర్యాదుల్లో ‘రెడ్’ కేటగిరీ పరిశ్రమలపై అధికంగా ఉంటున్నాయి. ఫార్మా, షుగర్, డిస్టిలరీ, థర్మల్ పవర్ ప్లాంటు వంటి పరిశ్రమలు ఇందులో ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు రసాయన వ్యర్థాల్ని శుద్ధి చేయకుండా భూగర్భ పైపులైన్ల ద్వారా సమీపంలోని చెరువులు, కుంటలు వంటి నీటి వనరుల్లో కలిపేస్తున్నాయి. మరికొన్ని పరిశ్రమల యజమానులు వర్షపు నీటిలో కలిసిపోయేలా వానాకాలంలో రసాయన వ్యర్థాల్ని వదిలేస్తున్నారు. సమీపంలో చెరువులు లేకుంటే ట్యాంకర్ల ద్వారా అర్ధరాత్రి వేళ తరలించి నీటి వనరులున్నచోట కలిపేస్తున్నారు.. గత అక్టోబరులో నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఓ ఇథనాల్ పరిశ్రమ నుంచి రసాయన వ్యర్ధాలతో వెళ్తున్న ట్యాంకర్ ను స్థానికులు పట్టుకోవడం ఇందుకు నిదర్శనం. సంగారెడ్డి జిల్లాలోని ‘రెడ్’ కేటగిరీ పరిశ్రమలపై ఎక్కువగా ఫిర్యాదులొస్తు న్నట్లు సమాచారం.
• ఆరెంజ్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలతో నీటి వనరులు లేదా గాలి కలుషితమవుతాయి. స్టోన్ క్రషర్లల ద్వారా గాలి మాత్రమే కలుషితమవుతుంది. పారాబాయిల్డ్ మిల్లులతో ధాన్యాన్ని ఉడికించినప్పుడు వచ్చే నీళ్లతో జలవనరులూ కలుషితమవుతాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ జిల్లాల్లో ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి.
పీసీబీ చర్యలు తీసుకున్న పరిశ్రమల సంఖ్య ఎక్కువే కన్పిస్తున్నప్పటికీ.. ఉపశమనం కల్పించిన పరిశ్రమల సంఖ్య కూడా భారీగానే ఉంది. గతే డాది ఏకంగా 242 పరిశ్రమలకు మూసివేత ఉత్తర్వుల నుంచి పీసీబీ ఉపశమనం కలిగించింది. గతంలో ఆయా పరిశ్రమలకు ఇచ్చిన మూసివేత, ఉత్పత్తి నిలిపివేత ఆదేశాలను సమీక్షించి.. మూసివేత ఆదేశాలను ఎత్తేసింది. ఆయా పరిశ్రమలు చేపట్టిన దిద్దుబాటు చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయంటూ రీజనల్ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా పరిశ్రమల్ని నడిపించుకునేందుకు పీసీబీ అనుమతులు ఇచ్చింది.