మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారంలోని (Nacharam) పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శ్రీకర బయోటెక్ (Srikara Biotech) అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ మొత్తానికి విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆప్రాంతం మొత్తం పొగలు కమ్ముకున్నాయి.
మంటలు ఒక్కసారిగా భారీగా ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని, ఆస్తినష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.