ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్‌ నియామకం చెల్లదన్న హైకోర్టు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల (MLC) నియామకాలపై ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ నియామకం చెల్లదని హైకోర్టు (High Court) స్పష్టం చేసింది. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను కొట్టివేసింది. దాసోజు శ్రవణ్‌, కూర సత్యనారాయణల ఎన్నికను గవర్నర్‌ పునర్‌పరిశీలించాలని ఆదేశించింది.

మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్‌ లేదని పేర్కొంది. కేబినెట్‌కు తిప్పిపంపాలి తప్ప తిరస్కరించకూడదని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.