కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్య ధోరణులు పెచ్చరిల్లుతున్నాయంటూ తెలంగాణ హైకోర్టు నిరుడు ఆగస్టులో అగ్గిమీద గుగ్గిలమైంది. ప్రజల ఫిర్యాదులపై తగిన చర్యలు కొరవడటం వల్ల వారంతా తమను ఆశ్రయిస్తున్నారన్న ఉన్నత న్యాయస్థానం – ఉండీ ఉపయోగం లేని పీసీబీ (కాలుష్య నియంత్రణ మండలి)ని మూసేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అప్పట్లో హెచ్చరించింది. ఒక అధికారి షోకాజ్ నోటీసు జారీ చేయగా అదే సంస్థ మూసివేతకు ఇంకో అధికారి ఉత్తర్వులివ్వడమేమిటని తాజాగా ప్రశ్నించిన కోర్టు- యాజమాన్యంతో లాలూచీ పడటానికి ఇద్దరూ అవకాశాలు చూసుకున్నట్లుందని గట్టిగా తలంటేసింది. పీసీబీ పనితీరు దారుణంగా ఉందన్న హైకోర్టు- అసమర్థ అధికారుల్ని సాగనంపి సమర్ధుల్ని కొలువు తీర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారగణం ఇలా అక్షింతలు వేయించుకున్న సందర్భాలు గతంలోనూ నమోదయ్యాయి. అధికారులు కార్యాలయాల్లో నిద్రపోతున్నారని. క్షేత్రస్థాయిలో సమస్యల్ని పట్టించుకోవడమే లేదంటూ తమిళనాడు పీసీబీ పనితీరును ఎన్ జీటీ (జాతీయ హరిత ట్రైబ్యునల్) రెండేళ్లక్రితం తీవ్రంగా ఆక్షేపించింది. ‘కాలుష్య నియంత్రణకు అసలు మీరేం చేశారో చెప్పరేమిటి?’ అని అదే ఎన్ జీటీ గతంలో ఆంధ్రప్రదేశ్ పీసీబీనీ నిగ్గదీసింది. తరతమ భేదాలతో దేశం నలుమూలలా పీసీబీ యంత్రాంగంలో అవ్యవస్థ ఎంతగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఇవన్నీ దృష్టాంతాలే. దేశవ్యాప్తంగా జలవనరుల్ని, భూగర్భజలాల్ని కలుషితం కానివ్వకుండా మూడునెలల వ్యవధిలో వ్యర్ధాల శుద్ధి కేంద్రాలు నెలకొల్పని పరిశ్రమలకు కరెంటు కోత విధించాల్సిందేనన్న సుప్రీంకోర్టు నిర్దేశాలు ఏడేళ్లుగా నీరోడుతున్నాయి. నిర్లక్ష్యానికి అవినీతి పోకడలు జతపడి దేశంలో కాలుష్య రక్కసి వికటాట్టహాసం చేస్తోంది!
దేశంలో గాలి, నీరు, నేలల నాణ్యతా పరిరక్షణకే కాలుష్య నియంత్రణ వ్యవస్థ అవతరించింది. వివిధ చట్ట నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి స్థితిగతుల్ని మదింపు వేసి వార్షిక నివేదికలు రూపొందించడం రాష్ట్రస్థాయి పీసీబీల విధుల్లో ముఖ్యమైనది. ఉత్పత్తి స్థానంలోనే కాలుష్య కట్టడి, కశ్మల తీవ్రతను తగ్గించడం కోసం సాంకేతికత వినియోగం, కాలుష్యం కాటుకు గురైన ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు, ప్రజాచైతన్యం పెంపొందించడం- ఇవన్నీ సీపీసీబీ(కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి)కి దఖలుపడిన బాధ్యతలు. అవేమీ యథాతథంగా అమలుకు నోచుకోని పర్యవసానంగా పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నిలువెల్లా తూట్లు పడుతున్నాయి. సీపీసీబీలో మంజూరైన మొత్తం కొలువులు 577., అందులో మూడోవంతు దాకా ఖాళీలు పోగుపడి ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన రమారమి 12వేల పోస్టుల్లో దాదాపు సగం వరకు భర్తీ కానేలేదు. పీసీబీ ప్రాంతీయ కార్యాలయాల్లో ఆర్వో (ప్రాంతీయాధికారి)గా నియామకాలకు లక్షల్లో రేటు పలుకుతున్నదంటే- అవినీతి మురుగు ఎంతగా పొంగులు వారుతోందో వేరే చెప్పాలా? అలా మొదలవుతున్న అవినీతి అడుగడుగునా లంచాల మేతకు ఇంధనమై నిఘావ్యవస్థను భ్రష్టుపట్టిస్తోంది. తెలుగు గడ్డతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, అస్సాం తదితరాల్లోని నదీ పరీవాహక ప్రాంతాలెన్నో విషకలుషితం కావడానికి పారిశ్రామిక వ్యర్థాల డంపింగ్ అడ్డూ ఆదుపూ లేకుండా సాగుతుండటమే ముఖ్యకారణం. ఆ పరిసర ప్రాంతాల్లోని పంట దిగుబడులూ క్షీణిస్తున్నాయి. తాగేనీరు, పీల్చే గాలి గరళమై జనజీవనం కృశించిపోతోంది. ఒక్కరిని చంపితేనే ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగారవాసం విధిస్తారు. అసంఖ్యాక కుటుంబాల్ని కాటేసి, దేశార్థికాన్నే కుంగదీసి, జనజీవన సౌభాగ్యాన్ని హరించివేస్తున్న కాలుష్యం కట్టడిలో ఘోరవైఫల్యాలకు బాధ్యుల్ని ఉపేక్షించడమేమిటి? నిబంధనల ఉల్లంఘనకు తెగబడే పరిశ్రమల్ని మూసెయ్యాలి. దేశంలో ఎక్కడ కాలుష్య సమస్య తలెత్తినా సంబంధిత నియంత్రణ మండలినే నేరుగా జవాబుదారీ చేయాలి. పర్యావరణ నిపుణులు, నిజాయతీపరులకే పీసీబీలు, సీపీసీబీలో ప్రాధాన్యం కల్పించి నిబంధనల ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపేలా యంత్రాంగాన్ని పరిపుష్టం చేస్తేనే- కాలుష్య నియంత్రణ గాడిన పడుతుంది! (సోర్స్: ఈనాడు)
